నష్టాల్లో నుంచి లాభాల బాట పట్టినప్పటికీ హైదరాబాద్ మెట్రో మాత్రం ప్రయాణీకులపై బాదుడు ఆపటంలేదు. కరోనా తర్వాత కష్టకాలం అనుభవించిన హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం కోట్లకొద్దీ లాభాల్లో ఉంది. అయినా సరే ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో స్టేషన్లలో టాయ్ లెట్ వినియోగిస్తే అందుకు ఫీజు చెల్లించాలంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది. 5 చెల్లిస్తే గానీ హైదరాబాద్ మెట్రో స్టేషన్లో టాయ్ లెట్ వాడుకోలేమన్నమాట. ఇలా వసూలు చేసిన సొమ్మును టాయ్ లెట్ పరిశుభ్రంగా ఉంచటానికే వినియోగిస్తామంటూ కారణాలు చెప్తోంది ఎల్ ఆండ్ టీ సంస్థ. నష్టాల్లో ఉన్న సమయాల్లో ప్రయాణీకులను ఆకర్షించటానికి హాలిడే స్పెషల్ టిక్కెట్లు, అదనపు డిస్కౌంట్లు ఇచ్చిన మెట్రో.. ఇప్పుడు రివర్స్ గేర్లో ప్రయాణీకులను దోచేసుకునే ప్లాన్ అమలు చేస్తోంది. పార్కింగ్ లో వాహనాలు పెట్టడానికి కూడా విపరీతమైన చార్జీలు విధిస్తున్నది ఎల్ ఆండ్ టీ సంస్థ.
ఎండాకాలం కావటంతో ఎండలను భరించలేని జనం సొంత వాహనాలను నడపలేక మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఒక కాలు పెడితే రెండో కాలు పెట్టడానికి ప్లేస్ లేకుండా కిక్కిరిసి పోతున్నాయి మెట్రో రైళ్ళు. విపరీతమైన రద్దీతో ఏమాత్రం సుఖం లేకుండా పోయింది మెట్రో ప్రయాణంలో. అయినా సరే వాతావరణ పరిస్థితులు అనుకూలించక మెట్రోనే ఆశ్రయిస్తున్నారు జనం. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రయాణీకులపై వరుసగా చార్జీల భారం వేస్తోంది మెట్రో. సెలవు రోజు 65 రూపాయల టిక్కెట్ తో రోజంతా ప్రయాణించే స్పెషల్ టిక్కెట్ ను రద్దు చేసింది. ఆ తర్వాత రాత్రి 10 దాటిన తర్వాత ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్ రద్దు.. ఆ తర్వాత మెట్రో కార్డు ధర పెంపు.. ఇప్పుడు టాయ్ లెట్ వినియోగానికి ఫీజు.. ఇలా సాగిపోతున్నది మెట్రో తీరు. గత నాలుగేళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదంటూ కియోలిస్ సంస్థ ఉద్యోగులు కొద్ది రోజుల క్రితం అమీర్ పేట మెట్రో వద్ద ధర్నా చేశారు. అడిగేవాడు లేడు కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నది మెట్రో యాజమాన్యం. వచ్చే వర్షాకాలంలో ప్రయాణీకులకు ఇంకెన్ని బంపర్ ఆఫర్లు ఇస్తుందో ఈ కంపెనీ.