ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన జనసేన యువశక్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రసంగించిన నటుడు హైపర్ ఆది.. పరోక్షంగా రోజాపై సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. హైపర్ ఆది కామెంట్ల తర్వాత మేగా ఫ్యామిలీకి రోజాకు మధ్య ఓ యుద్ధమే మొదలైంది. హైపర్ ఆది ఓ జోకర్ అనీ.. మెగా ఫ్యామిలీ పిరికి ఫ్యామిలీ అనీ రోజా టైం దొరికినప్పుడల్లా ఉతికి ఆరేస్తోంది. రోజా కామెంట్లకు కౌంటర్ గా జనసేన నేతలు కూడా గట్టిగానే ఇచ్చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగా.. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన పోస్టర్లు.. ఏపీలో చిన్నపాటి చర్చకు దారితీశాయి. కాబోయే సినిమాటోగ్రఫీ మినిస్టర్ హైపర్ ఆది అంటు గుర్తు తెలియని మహిళలు ముగ్గురు మూడు పోస్టర్లు పట్టుకొని ఉన్న ఫోటో.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మరో సోషల్ మీడియా వార్ కు దారితీసినట్టు కనిపిస్తోంది.
“హైపర్ ఆది రావాలి.. పాలన మారాలి”, “2024లో జనసేన నుంచి కాబోయే మంత్రి హైపర్ ఆది”.. ఇలా కొటేషన్లు రాసిన ప్లేకార్డులు పట్టుకొని ముగ్గురు మహిళలు ఫోటోలకు పోజులిచ్చారు. వీళ్ళు ఎవరో ఏమిటో తెలియదు.. వీళ్ళు నిజంగా హైపర్ ఆదికి సపోర్ట్ చేస్తున్నారా.. లేక వ్యంగ్యంగా ఇలాంటి పోస్టర్లు ప్రదర్శిస్తున్నారా క్లారిటీ లేదు. అయితే ఈ ఫోటోను షేర్ చేసింది మాత్రం వైసీపీ నేతలే. ఈ ఫోటోలు చూపించి ఆదిని వెక్కిరిస్తున్నారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణే ఇప్పటి వరకూ ఎన్నికల్లో గెలిచింది లేదు.. ఇప్పుడు ఏకంగా హైపర్ ఆది మంత్రి అయిపోయాడా అంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తుంటే.. పాపం జనసేన నాయకులు ఎలా రియాక్ట్ కావాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.