వారం క్రితం టర్కీ సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపం ఆయా దేశాల చరిత్రలోనే అత్యంత పెద్ద విపత్తులుగా రికార్డయ్యాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 37వేలకు పైనే అని ఆయా దేశాల మీడియా చెప్తోంది. అయితే.. ప్రభుత్వం మాత్రం భూకంపంలో మరణించిన వారి సంఖ్యను అధికారికంగా వెల్లడించటం నిలిపివేసింది. మీడియా కథనాల ప్రకారం టర్కీలో 32 వేల మంది మరణించగా సిరియాలో సుమారు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ సంఖ్య ఇప్పటితో ఆగేలా లేదు. ఇంకా వేలాది భవనాల కింద వేలాది మంది చిక్కుకోని ఉన్నారు. వారిలో దాదాపు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
మృతదేహాలను ఖననం చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లు చూస్తే గుండెలు అవిసిపోతాయి. మృతదేహాలను కుప్పలుగా క్రేన్లలో తరలించటం.. కుప్పలుగా పడేసి ఖననం చేస్తున్న దృశ్యాలను చూస్తున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఊర్లే స్మశానాలుగా మారిన టర్కీ మరుభూమిని తలపిస్తోంది. ఇంత దారుణమైన దృశ్యాలను జీవితంలో చూడాల్సి వస్తుందని.. అది తమ కుటుంబ సభ్యుల మృతదేహాలకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ మృతుల బంధువులు తల్లడిల్లిపోతున్నారు. రోజులో సుమారు 18 గంటల పాటు మృతదేహాల ఖననం కొనసాగుతూనే ఉంది. మరోవైపు శిథిలాల కింద నలిగిపోయిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఛిద్రమైన శరీరాలను వెలికి తీస్తున్న క్రమంలో అక్కడే కోటి ఆశలతో తమ వారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు తీవ్ర నిరాశతో పాటు విషాదమే మిగులుతోంది.
గత సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో తొలిసారి భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు వందకు పైగా భూప్రకంపనలు సంభవించి సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలగజేశాయి. ఈ రోజు ఉదయం కూడా టర్కీలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది.