బుల్లి తెర కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 21న తీవ్రమైన చాతీ నొప్పి రావటంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ కు తరలించగా చంటిని పరీక్షించిన డాక్టర్లు.. హార్ట్ ఎటాక్ అని నిర్ధారించారు. కాకపోతే తీవ్రమైన గుండెపోటు కాకపోవటంతో చంటికి ప్రమాదం తప్పిందని.. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చంటి బ్లడ్ వెసెల్స్ లో రక్తం గడ్డ కట్టి అక్కడక్కడ పూడికలు ఉన్నాయనీ.. ఈ హార్ట్ బ్లాక్స్ కారణంగా రక్త సరఫరాలో చిన్న ఆటంకం ఏర్పడి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదనీ కేర్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం చంటి ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
చంటికి హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయం ఈ రోజు వరకు అతడి కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించలేదు. చంటికి చాలా దగ్గరి స్నేహితులు, బంధువులకు మాత్రమే అతని పరిస్థితి వివరించారు తప్ప బయటకు రానివ్వలేదు. ఈ విషయం తెలిసిన చంటి అభిమానులు, చంటితో పాటు బుల్లితెరపై నటించిన అతడి సహ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ షాక్ కు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే కేర్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. అయితే చంటి ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటుండటంతో ఎవరినీ కలిసే పరిస్థితి లేదు.