ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్లలో కొత్త కొత్త దారులు వెతుకుతోంది. సినిమా యూనిట్ తీసుకున్న ఓ సరికొత్త నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. రామాయణం ఎక్కడ చెప్పుకుంటున్నా సరే అక్కడికి హనుమంతుల వారు అందరికంటే ముందు వచ్చి కూర్చొని.. రామాయణం పూర్తిగా విని.. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారట. ఈ విషయం పురాణాల్లో చెప్పబడింది. అంతే కాదు సీతారాముల గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఆంజనేయుడు అక్కడికి వెళ్ళి ఆ చర్చను ఆసాంతం వింటారట. దీని ఆధారంగా ఆదిపురుష్ ఓ వెరైటీ నిర్ణయం తీసుకున్నది. ఆదిపురుష్ సినిమా షో జరుగుతున్న ప్రతి థియేటర్లోనూ చిరంజీవి హనుమంతుల వారి కోసం ఓ సీటు రిజర్వ్ చేసి పెడతారట. ఆ సీటులో వేరెవ్వరూ కూర్చోవద్దనీ.. ఖచ్చితంగా ఆదిపురుష్ సినిమా చూడటానికి ఆంజనేయుడు ఆ థియేటర్ కు వస్తాడనీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ చెప్తోంది సినిమా యూనిట్.
వేల సంవత్సరాలుగా ప్రపంచానికి సుపరిచితమైన సీతారాముల రామాయణ గాధ ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16న విడుదల కానున్న విషయం తెలిసిందే. జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ఈ వేడుకకు త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
