గుణశేఖర్ 300 కోట్ల కొత్త సినిమా గోవిందా గోవింద

అప్పుడెప్పుడో రుద్రమదేవి సినిమాతో ఫరవాలేదనిపించిన టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్.. రీసెంట్ గా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డారు. స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం.. మూడో రోజు నుంచే కలెక్షన్లలో డల్ అయిపోయి బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా శాకుంతలం కలెక్షన్లతో డీలా పడ్డారు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో సమంతకు పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు.. అలాగే దిల్ రాజుకు కూడా ఎఫెక్ట్ ఏమీ కాదు. కానీ డైరెక్టర్ గుణశేఖర్ కు మాత్రం శాకుంతలం పెద్ద షాకే ఇచ్చింది. అతడిని నమ్మి ఇకపై భారీ బడ్జెట్ సినిమాల కోసం ఇన్వెస్ట్ చేయటానికి భవిష్యత్తులో ఏ నిర్మాతా ముందుకు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.
శాకుంతలం సినిమా తర్వాత హిరణ్య కశ్యప అనే మరో భారీ ప్రాజెక్టు కోసం గుణశేఖర్ ఎదురు చూస్తున్నాడు. నిర్మాత సురేష్ బాబు 300 కోట్ల బడ్జెట్ తో హిరణ్యకశ్యప సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడనే వార్తలు ఇదివరకు వినిపించాయి. కానీ శాకుంతలం సినిమా తర్వాత ఇలాంటి భారీ పెట్టుబడి పెట్టేందుకు సురేష్ బాబు సిద్ధంగా లేడనీ.. గుణశేఖర్ ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన మానుకుంటే మేలనీ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రుద్రమదేవి సినిమా విషయంలో కూడా గుణశేఖర్ చాలా ఆర్థిక కష్టాలు అనుభవించాడు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు పన్ను మాఫీ లాంటి స్కీమ్ ప్రకటించి ఉండకపోతే గుణశేఖర్ చాలా నష్టపోవాల్సి వచ్చేది. ఇప్పుడు శాకుంతలం డిజాస్టర్ అయిన తర్వాత.. ఇక ఈ డైరెక్టర్ పై మళ్ళీ నమ్మకం ఉంచి అంత పెద్ద ప్రాజెక్టులు చేయటానికి నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశాలు లేనట్టే.