చాలా కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరియు తెలంగాణ ప్రభుత్వం మధ్య దూరం పెరిగిందన్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన బిల్లులను గవర్నర్ అటు ఆమోదించకుండా.. ఇటు తిప్పి పంపించకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచుకొని ఆలస్యం చేస్తోందనీ.. గవర్నర్ కావాలని ఇలా చేయటం వల్ల తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో పడుతున్నాయనీ తెలంగాణ ప్రభుత్వం వాదన. దీనిపై టీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ గవర్నర్ వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఊహించని తీర్పునిచ్చింది.
తమ ప్రభుత్వం తయారు చేసి ఆమోదం కోసం పంపించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశ పూర్వకంగానే పెండింగ్ లో ఉంచేశారనీ.. ఈ తాత్సారం వల్ల ఎన్నో కార్యక్రమాలు ఆగిపోయాయనీ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. గవర్నర్ దయా దాక్షిణ్యాల మీద ఓ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి దురదృష్టకరమనీ.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరారు. అటు గవర్నర్ తరఫు న్యాయవాది కూడా తమ వాదన వినిపించారు. గవర్నర్ కావాలని ఏ బిల్లును కూడా పెండింగ్ లో ఉంచలేదని స్పష్టం చేశారు. గవర్నర్ వద్దకు 10 బిల్లులు ఆమోదం కోసం రాగా అందులో 3 బిల్లులను ఆమోదించడం జరిగిందనీ.. మరో రెండు బిల్లులను పరిశీలన కోసం రాష్ట్రపతి వద్దకు పంపించామనీ.. మరో రెండు బిల్లుల విషయంలో పూర్తి వివరాలు, వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తిప్పి పంపించామనీ చెప్పారు. ఇక మిగిలిన మూడు బిల్లులలో ఒక బిల్లును గవర్నర్ తిరస్కరించగా.. మిగతా రెండు బిల్లులపై కూడా అదనపు వివరణ కోరుతూ ప్రభుత్వానికి తిరిగి పంపించామని చెప్పారు.
ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. గవర్నర్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక రాష్ట్ర అసెంబ్లీ రూపొందించిన బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని 200వ అధికరణంను అనుసరిస్తూ వెంటనే ఆమోదించటమో లేక తిరిగి పంపించటమో చేయాలని సూచించింది. రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. ఇక గవర్నర్ తరఫు న్యాయవాది మరో అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల 167 ప్రకారం ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ల మధ్య తరచుగా సమావేశాలు జరగాల్సి ఉన్నదనీ.. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్ ను రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తనతో సమావేశాలు, సంప్రదింపులు చేయటం లేదనీ వాదించారు. ఎట్టకేలకు బిల్లుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు రావటం చర్చనీయాంశంగా మారింది.