పెద్ద కంపెనీల్లో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. దిగ్గజ సంస్థ గూగుల్ ఈసారి 450 మంది ఇండియన్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులకు రాత్రి ఈ మెయిల్ ద్వారా తొలగిస్తున్నట్టు మెయిల్ వచ్చింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా నుంచి మెయిల్ వచ్చినట్టు హిందూ బిజినెస్ లైన్ కథనం ప్రచురించింది. గత నెలలోనే గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భారీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి లేఆఫ్ పేరిట మరి కొంత మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఉద్యోగాల నుంచి తొలగించబడిన కొంత మంది లింక్డ్ ఇన్ లో ఈ విషయాన్ని పేర్కొంటూ కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్తున్నారు.
గత నెలలోనే గూగుల్ సహా దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగుల ఉద్వాసన పర్వాన్ని ప్రారంభించాయి. గూగుల్, అమేజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విటర్.. ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల నుంచి లేఆఫ్ ల వల్ల తొలగించబడిన వారి సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే.. ఈ ఉద్యోగాల తొలగింపు ఇక్కడితో ఆగిపోతాయా లేక మరింత మంది ఉద్యోగులను తొలగిస్తారా అనేది మాంద్యం తీవ్రతపై ఆధారపడి ఉండనుంది.