ఉత్తర్ ప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్ హత్య చోటు చేసుకుంది.. అది కూడా కోర్టులో. ఓ కేసులో విచారణ నిమిత్తం గ్యాంగ్ స్టర్ అయిన సంజీవ్ జీవాను లక్నో లోని సివిల్ కోర్టుకు హాజరు పరుచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. సంజీవ్ అక్కడికి వస్తాడని ముందె తెలిసిన కొంత మంది పక్కా ప్లాన్ ప్రకారం లాయర్ల వేషంలో వచ్చి సంజీవ్ కు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి పక్కనే ఉన్న పోలీసులతో పాటు ఓ ఆరేళ్ళ బాలిక కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్టు సమాచారం. దుండగుల కాల్పుల్లో సంజీవ్ జీవా తప్ప ఇంకెవరికీ ప్రాణహాని జరగలేదు. సంజీవ్ హత్య మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ అదుపులో లేదంటున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనతో మరోసారి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోనే పేరు మోసిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ను పోలీసుల అదుపులో ఉండగానే దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. మీడియా వ్యక్తుల వేషంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీక్ అహ్మద్ ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురి పెట్టి కాల్చి చంపారు. అతీక్ తో పాటు పక్కనే ఉన్న అతని సోదరుడు ఆష్రఫ్ ను సైతం దుండగులు కాల్చి చంపేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఓ పక్క పోలీసులు పేరు మోసిన మాఫియా డాన్ లనూ.. గ్యాంగ్ స్టర్ లనూ ఎన్ కౌంటర్లో చంపేస్తుంటే.. మరో పక్క పేరు మోసిన మాఫియా వ్యక్తులను వారి శతృవుల రూపంలో అదే మాఫియా బలి తీసుకుంటున్నది. ఈ రోజు జరిగిన హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు.