గురువారం ఉదయం సికింద్రాబాద్ లోని దక్కన్ స్పోర్ట్స్ మాల్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయినట్టు పోలీసులు వెల్లడించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో మాల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించగా సుమారు 8 గంటల పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 40 ఫైరింజన్ లతో తీవ్రంగా శ్రమించిన డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి 7 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ భవనం మాత్రం పూర్తిగా కాలిపోయింది. లోపలి స్లాబులు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం డీఆర్ఎఫ్ బృందాలు దక్కన్ మాల్ భవనాన్ని కూల్చేపనిలో ఉన్నాయి.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో మాల్ లో నుంచి నలుగురు వ్యక్తులను ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ బయటకు తీసుకురాగలిగారు. కానీ అప్పటికే మాల్ లో మరో ఇద్దరు ఉన్నారంటూ స్థానికులు చెప్పారు. పోలీసులు కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. స్థానికులు చెప్పినట్టు లోపల ఎవరైనా చిక్కుకున్నారో లేదో ఖచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ ఈ రోజు భవనాన్ని కూల్చే క్రమంలో లోపలికి వెళ్ళిన డీఆర్ఎఫ్ అధికారులకు మూడు మృతదేహాలు కనిపించాయి. పూర్తిగా దగ్ధమైన స్థితిలో కనీసం గుర్తించడానికి వీలులేనంత స్థాయిలో మృతదేహాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు.