ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భూకంపాల భయం

దేవభూమిలో జరుగుతున్న పరిణామాలు 140 కోట్లకుపైగా భారతీయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొన్నటికిమొన్న బీటలు వారిన జోషీమఠ్‌ అంశం దేశాన్ని కలవరపెడితే.. ఇప్పుడా బీటలు జోషీమఠ్ సరిహద్దులు దాటేశాయి. ఒక్కటీరెండూకాదు ఏకంగా ఎనభై కిలోమీటర్లకు పైగా రహదారులు నెర్రలిచ్చేశాయి. ఇదెక్కడ ఆగుతుందో అంచనాకు కూడా అందడంలేదు. ఇదే సమయంలో ఉత్తరభారతం స్వల్ప భూకంపాలతో చిగురుటాకులా వణికిపోయింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యా నాలతోపాటూ పొరుగుదేశం నేపాల్‌లోనూ భూమి కంపించింది. అదికూడా కేవలం గంటల వ్యవధిలోనే. ఇలాంటి సమయంలోనే టర్కీ, సిరియా లాంటి భయంకర భూకంపం భారత్‌కూ తప్పదనే సైంటిస్టుల హెచ్చరికలు ఇంకాస్త టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఫలితంగా భారత్‌లోనే చారిత్రాత్మక యాత్ర చార్‌ధామ్‌పై అందరి అటెన్షన్ కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో చార్‌ ధామ్ యాత్ర సేఫేనా అన్న ఆందోళనే అందరిదీ.
ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ ఏ క్షణమైనా భూకంపం సంభవించ వచ్చనే శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. జోషీమఠ్‌కు 82 కిలోమీటర్ల దూరంలోని కర్ణప్రయాగ్‌లోనూ తాజాగా భూమి కుంగి భవనాలు బీటలు వారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి కొన్నిచోట్ల పగుళ్లు తేలితే- అధికార యంత్రాంగం కొద్దిరోజుల క్రితం వట్టిగా సిమెంట్‌తో వాటిని పూడ్చేసింది. అవి తిరిగి నోళ్లు తెరుస్తుండటమే కాదు- అదే దోవలో జోషీమఠ్‌ నుంచి మార్‌వాడీల మధ్య కొత్తగా కనీసం పది చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు కారణాలేమిటో, వాటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్వల్ప భూకంపాలతో ఉత్తరభారతం వణికిపోయింది.
ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత ఏడాది నవంబర్‌లో నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు చెన్నైలో బుధవారం ఉదయం తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని, అన్నాసాలై మరియు వైట్స్ రోడ్‌లోని అనేక భవనాల నివాసితులలో భయాందోళనలు చోటుచేసుకున్నాయని నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఈ స్వల్ప భూకంపాలకు ముందే హైదరాబాద్‌లోని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు పలు హెచ్చరికలు చేశారు.
ఇవీ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు చేసిన హెచ్చరికలు. ఇటీవల టర్కీ, సిరియాలను కుదిపేసిన మాదిరిగానే ఉత్తరాఖండ్‌‌ ప్రాంతంలో‌నూ ఎప్పుడైనా శక్తివంతమైన భూకంపం సంభవించవచ్చని, ఇందుకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలోని భూమి ఉపరితలం కింద చాలా ఒత్తిడి ఏర్పడుతోందని, దీని కారణంగా పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉందన్నారు. నిజానికి,బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ముఖద్వారంగా భావించే జోషిమఠ్‌లో ఇటీవల భూమి క్షీణించిన నేపథ్యంలో సీనియర్ శాస్త్రవేత్త హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. లక్షలాది మంది యాత్రికులను ఉత్తరాఖండ్ పర్వతాలకు చేర్చే చార్‌ధామ్ యాత్ర దాదాపు రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే జోషీమఠ్ పరిస్థితులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాఖండ్‌పై దృష్టిసారించిన శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతాల్లో దాదాపు 80 భూకంప కేంద్రాలను ఏర్పాటు చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే హిమాలయాల భూమిలో ఒత్తిడి పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నట్లు తమ డేటా చూపిస్తుందనీ, కచ్చితమైన సమయం చెప్పలేకపోయినా.. టర్కీలాంటి భూకంపం ముప్పు హిమాలయాలకు పొంచి ఉందని తేల్చేశారు. ఈ ప్రకటన చేసిన తర్వాతిరోజే హిమాలయాలకు నెలవైన ఉత్తరాఖండ్, నేపాల్‌లో భూమి కంపించింది.
మరోవైపు.. ఏప్రిల్‌ నెల నుంచి చార్‌ధామ్‌ యాత్ర నిర్వహణకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తలను ఇప్పుడదే తీవ్రంగా విస్మయపరుస్తోంది. బద్రీనాథ్‌ మార్గంలో గతేడాది 16 లక్షల మంది ప్రయాణించారు. భక్తులూ పర్యాటకుల తాకిడి ఈసారి అంతకు మూడు రెట్లు అధికంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. రాకపోకలు పెద్దగా లేని రోజుల్లోనే పగుళ్లు తేలిన రహదారి.. చార్‌ధామ్ యాత్ర ఊపందుకొని వేల సంఖ్యలో వాహనాలు పరుగులు తీసే సమయంలో పెనుఒత్తిడిని తట్టుకోగలదా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా నేల కుంగుబాటుపై సమగ్రఅధ్యయనం నిర్వహించాల్సి ఉంది.. అప్పటివరకు ప్రమాదకరమైన ఈ ప్రాంతంలోకి లక్షల సంఖ్యలో ప్రజలను అనుమతించడం నిప్పుతో చెలగాటమాడటమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు పుణ్యధామాల సందర్శనకు తరలిరాబోతున్న ఆసేతుహిమాచల అశేష భక్తజనాన్ని ఆ మేరకు ఉత్తరాఖండ్‌ సర్కారు పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ, ఆ దిశగా ఎలాంటి అడుగులూ పడుతున్నట్టుగా కనిపించడం లేదు.
ఇదిలాఉంటే.. శాస్త్రవేత్తల అంచనాలే నిజమై హిమాలయాల్లో భారీ భూకంపం సంభవిస్తే మాత్రం భారత్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కల్లోలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్నీ శాస్త్రవేత్తలే అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవిస్తే దాదాపుగా 8 లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనేది శాస్త్రవేత్తలు ముందునుంచీ హెచ్చరిస్తున్న వేళ.. తాజా పరిణామాలు ఇంకాస్త టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఇటీవల టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే ఊహించిన డచ్ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ సైతం ఇలాంటి హెచ్చరికలే చేయడంతో హిమాలయాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే కనిపిస్తోంది.