రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య ఆయుధ నిల్వలు తరిగిపోవటం.. జీ-7 సదస్సులో ఈ యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొలపాలన్న వివిధ దేశాల ప్రయత్నాలు ఓ వైపు జరుగుతుండగా.. అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా తమకు ఎఫ్-16 ఫైటర్ యుద్ధ విమానాలు ఇవ్వాల్సిందిగా అమెరికా, యూరప్ దేశాలను కోరుతున్న జెలెన్ స్కీ కోరికను ఆయాదేశాలు మన్నించాయి. లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అత్యాధునిక ఫైటర్ జెట్ అయిన ఎఫ్-16 విమానాలను ఉక్రెయిన్ కు అందించేందుకు సరేనన్నాయి. దీంతో నేడో రేపో యుద్ధం ఆగి శాంతి నెలకొంటుందన్న గల్లంతయ్యాయి. అమెరికా తాజా నిర్ణయంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయొద్దని హెచ్చరించినా అమెరికా, యూరప్ దేశాలు పట్టించుకోవటం లేదనీ.. దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది.
జపాన్ లోని హిరోషిమా లో ప్రస్తుతం జీ-7 దేశాల సదస్సు జరుగుతోంది. ఈ వేదికపై రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అమెరికా, యూరప్ దేశాలు మొదటి నుంచి చెప్తుంటే.. శాంతి దిశగా ఆ నిర్ణయాలు ఉంటాయేమో అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తూ యుద్ధం పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తోంది అమెరికా. అప్పుల ఊబిలో మునిగి ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఉన్న అమెరికా త్వరలో దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయటం అమెరికాకు ఆర్థికంగా పెనుభారంగా పరిణమించనుంది. దివాలా అంచున ఉండి కూడా బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు సాయం ప్రకటించటంపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు.
ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధంలో రష్యాను మరింత బలహీనం చేసి.. చివరకు రష్యాను ఓడించి సోవియట్ దేశాలను విచ్ఛిన్నం చేయాలనేది అమెరికా మరియు నాటో దేశాల వ్యూహం. ఇందులో భాగంగానే అన్ని దేశాలు కలిసి ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్నాయి. రష్యాను ఓడించే వ్యూహంలో ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా బలహీనం అయ్యాయి.. కానీ సాయం మాత్రం ఆపటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే చివరకు రష్యా అధినేత పుతిన్ అణుయుద్ధానికైనా సిద్ధపడతాడే గానీ అమెరికా ముందు లొంగిపోడు. మొత్తం ఉక్రెయిన్ ను బూడిద చేస్తాడేమో గానీ పుతిన్ ఓటమి అంగీకరించే వ్యక్తి కాదు. ఈ విషయం తెలిసి కూడా అమెరికా, యూరప్ దేశాలు పుతిన్ ను రెచ్చగొడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరో ప్రపంచ యుద్ధం తప్పదనేది అంతర్జాతీయ విశ్లేషకుల హెచ్చరిక.