ఎమర్జెన్సీ.. భారతదేశ చరిత్రలో ఓ చికటి అధ్యాయంగా విశ్లేషకులు చెప్తారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందనేది చరిత్ర చెప్పే నిజం. ప్రతిపక్ష నాయకులను జైళ్ళలో వేయటం.. తిరుగుబాటు చేసిన వారిని పోలీసుల చేత కాల్చి చంపించటం.. ఇంకా ఎన్నో ఎన్నో ఘోరాలు ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశంలో జరిగాయి. అయితే.. ఎప్పుడూ ఏదో వివాదాన్ని వెంట బెట్టుకునే బాలీవుడ్ నటి కంగణ.. ఇప్పుడు ఇదే ఇతివృత్తంతో ఎమర్జెన్సీ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. అచ్చు గుద్దినట్టు ఇందిరా గాంధీలాగానే కనిపిస్తోంది ఈ టీజర్ లో కంగణ రనౌత్. ఎమర్జెన్సీ విధించబడిన సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపై సినిమా కథ నడుస్తున్నదని టీజర్ చూడకపోయినా అర్థం చేసుకోవచ్చు.. కానీ సినిమా కథలో ఎమర్జెన్సీని బలపరుస్తూ చూపించారా లేక ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చూపించారా అనేది మాత్రం అర్థం కాలేదు.
1975 ఆగస్ట్ లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధాని ఇందిర నిర్ణయం తీసుకోవటాన్ని టీజర్ లో చూపించారు. వార్తల్లోని హెడ్ లైన్స్ లో ఇందిరపై విమర్శలు రావటం.. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు.. ఇలా టీజర్ లో కనిపిస్తున్నాయి. ఇందిర అంటే భారత్.. భారత్ అంటే ఇందిర.. అంటూ కంగన డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది. నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎమర్జెన్సీ సినిమాకు నిర్మాత, డైరెక్టర్ అన్నీ కంగణానే. ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటూ చెప్తోంది కంగణ. ఈ సినిమాపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందనీ.. ఈ సినిమానే తనకు లైఫ్ ఆండ్ డెత్ సమస్య అనీ స్టేట్మెంట్ ఇచ్చింది. టీజర్.. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది.. సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.