హైదరాబాద్ రోడ్లపై అప్పుడెప్పుడో నిజాం కాలం నాడు డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవని అందరికీ తెలిసిందే. రాను రానూ సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో హైదరాబాద్ సిటీ రోడ్లపై మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తిరగబోతున్నాయి. మరో 2,3 రోజుల్లోనే ప్రభుత్వం ఈ డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేయనుందని సమాచారం. ఒక్కొక్కటి సుమారు 2 కోట్లు ఖరీదు చేసే 6 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ.. అధికారిక ప్రకటన తర్వాత హైదరాబాద్ సిటీ రోడ్లపై బస్సులు తిరగటం ప్రారంభం అవుతుందనీ తెలుస్తోంది.
అయితే.. ఈ బస్సులు సిటీ మొత్తం తిరగటానికి కాకుండా కేవలం భాగ్యనగరంలోని టూరిస్ట్ ప్రదేశాల మధ్య మాత్రమే తిరుగుతాయట. హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలన్నింటినీ కలుపుతూ ఓ కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఈ రూట్లలో ప్రతి రోజూ డబుల్ డెక్కర్ బస్సులు నడపటానికి ఆర్టీసీ రెడీ అయ్యింది. గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే వారికి స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు నిలవనున్నాయి. టికెట్ ధర ఇంకా తెలియలేదు కానీ.. అత్యధికంగా 65 రూపాయలకు మించకుండా టికెట్ రేట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.