అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అందరికీ షాకిచ్చాడు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన అనంతరం ట్రంప్ ను సోషల్ మీడియా బ్యాన్ చేసింది. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి ట్రంప్ నిషేధం ఎదుర్కున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న నేపథ్యంలో.. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై రీఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన వెంటనే గత నవంబర్ లో ట్రంప్ అకౌంట్ యాక్టివ్ చేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్రంప్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇప్పుడు మిగతా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో అయామ్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
ట్విటర్ లో ట్రంప్ కు 87 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ట్రంప్ యూట్యూబ్ చానల్ కు ఏకంగా రెండున్నర మిలియన్లకు పైగానే సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 34 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇంత ఫాలోయింగ్ కలిగి ఉన్న పొలిటికల్ లీడర్ ను బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన తర్వాత అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి నిషేధించారు. చాలా కాలంగా దీనిపై మౌనంగానే ఉన్న ట్రంప్.. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా మారనున్నాడు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా తాను పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఎన్నికల్లో తనకు కావాల్సిన మద్దతు కోసం ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టేశాడు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ను ఆయన పాలనా విధానాన్ని విమర్శిస్తూ అప్పుడప్పుడు అమెరికాలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న ట్రంప్.. ఇప్పుడు మరింత స్పీడు పెంచనున్నాడన్నమాట.