హీరోయిన్ డింపుల్ హయాతీ, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు మధ్య మొదలైన కారు పార్కింగ్ వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. తన కారును ధ్వంసం చేసిందంటూ ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే డింపుల్ పై సంచలన ఆరోపణలు చేయటంతో పాటు తన కారు డ్రైవర్ తో డింపుల్ పై ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించాడు ఈ రోజు ఉదయం. అంతే కాకుండా డింపుల్ కు కేసు విషయంలో కోర్టు నుంచి సమన్లు పంపించాడు రాహుల్. దీంతో ఇద్దరి మధ్య వివాదం పెద్దగానే మొదలైంది అనుకుంటే.. రాహుల్ కోర్టు సమన్లకు డింపుల్ ఇచ్చిన రిప్లై.. వార్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. రాహుల్ అధికార దుర్వినియోగం చేస్తున్నాడనీ.. తాను ఎంత వరకైనా వస్తాననీ.. న్యాయ పోరాటానికి రెడీ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చింది డింపుల్. రాహుల్ పై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అందుకు నిరాకరించిన పోలీసులు పూర్తి విషయం తెలిసిన తర్వాతే కేసు ఫైల్ చేస్తామని చెప్పి పంపించేశారు.
ప్రతి రోజూ తన కారుకి డింపుల్ తన కారును అడ్డుగా పెట్టేదనీ.. తాను పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎప్పుడు ఏ ఎమర్జెన్సీపై బయటకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఎన్నోసార్లు తన కారుకు డింపుల్ కారు అడ్డంగా పార్క్ చేయవద్దని ఆమె దృష్టికి తీసుకెళ్ళాననీ రాహుల్ హెగ్డే చెప్తున్నాడు. దీనిపై ఆమెకు పర్సనల్ గా కూడా కలిసి రిక్వెస్ట్ చేసినా ఆమె పట్టించుకోలేదన్నాడు. చివరికి తన కారును డింపుల్ స్వయంగా దాడి చేసి ధ్వంసం చేసిందని చెప్పాడు. కానీ డింపుల్ వాదన వేరేలా ఉంది. తన కారుపై ఇష్టం వచ్చినట్లు చలానాలు వేశారంటూ డింపుల్ ఆరోపిస్తోంది. డీసీపీ డ్రైవర్ తరచుగా తన కారుకు రాళ్ళను అడ్డుపెట్టి వెళ్ళే వాడనీ.. కారు బయటకు తీసినప్పుడల్లా ఆ రాళ్ళను తొలగించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చేదనీ చెప్తోంది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని హుడా ఎన్ క్లేవ్ లో వీరిద్దరూ నివాసముంటున్నారు. అపార్ట్ మెంట్ వాళ్ళు మాత్రం డీసీపీ డ్రైవర్ చేసిన పని బహుశా డీసీపీకి తెలియకపోవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా.. డింపుల్ ఇంతలా కౌంటర్ ఇస్తున్నదంటే.. ఆమె నిజంగా ఇబ్బండి పడే ఉంటుంది అనేది సోషల్ మీడియా టాక్.