ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు విచారణ అనంతరం అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదని.. దీన్ని బట్టి చూస్తే ఈడీ ఆరోపణలు చేసిన నిందితులు అసలు నేరం చేయనట్టే పరిగణించాల్సి వస్తుందని కోర్టు పేర్కొంది. అసలు కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పటానికి ఏ విధమైన ఆధారాలు లేవని చెప్పింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. తన భార్య అనారోగ్యం దృష్ట్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని శరత్ చంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్ ను విచారించిన కోర్టు శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న మద్య విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మరో లిక్కర్ పాలసీని రూపొందించే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయనీ.. దీని వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఈడీ పలువురిపై కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీషి సిసోదియా ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టు అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరి కొంత మంది నిందితులను ఈడీ విచారిస్తున్నది కూడా. ఈ క్రమంలో సీబీఐ కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. శరత్ చంద్రారెడ్డి నేరం చేశాడనటానికి ఆధారాలు ఈడీ సమర్పించలేదని కోర్యు వ్యాఖ్యానించిందా.. లేక అసలు లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందనటానికి అసలు ఏరకమైనా ఆధారాలు సమర్పించలేదని వ్యాఖ్యానించిందా అనేది పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.