ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. విశాఖపట్నంలోని ఎన్జీఓ హోమ్ లో కరోనాతో 21 సంవత్సరాల యువకుడు మరణించటం తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. కరోనా కారణంగానే ఆ యువకుడు మరణించినట్టు విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించటం విశాఖలో కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన వైద్యాధికారులు యువకుడితో కాంటాక్ట్ అయిన అందరినీ హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించటంతో పాటు వైద్యం మొదలుపెట్టారు. కరోనాతో యువకుడు ప్రాణాలు కోల్పోవటాన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది.
మరో వైపు దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఇదివరకే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కరోనా గైడ్ లైన్స్ జారీ చేసింది. కోవిడ్ డ్రైవ్ లు నిర్వహించటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం.. అలాగే కరోనా పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్ చేపట్టడం వెంటనే మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా కేసులు నమోదు అవుతుండటం తెలిసిందే కానీ మరణాలు సంభవించటం ఇటీవలి కాలంలో చాలా అరుదుగానే జరుగుతోంది. వయసు మీద పడిన వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు కనిపించాయే తప్ప ఆరోగ్యంగా ఉన్న యువకులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరగలేదు. విశాఖ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.