కన్నడనాట పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల వ్యూహాలు ఊహకందని రీతిలో కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అభ్యర్ధిని ఎంపికచేయడంలోనో, ప్రత్యర్ధుల బలహీనతలను దెబ్బకొట్టడంలో నో మాత్రమే కనిపించే వ్యూహాలు.. కర్ణాటకలో మాత్రం మేనిఫెస్టోలకు ఎక్కుతున్నాయి. వాస్తవానికి.. ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామో మాత్రమే చెబుతోంది. కానీ, కన్నడనాట అగ్రపార్టీల మేనిఫెస్టోల్లో కావాల్సినంత సంక్షేమంతోపాటూ అంతకుమించిన మాస్టర్ స్ట్రాటజీలు కూడా కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా కమలం పార్టీ మేనిఫెస్టోలో పేదోళ్లకి రోజుకు అరలీటరు నందిని పాలు ఫ్రీ అని హామీ ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సైతం కమలం హామీలకు ఏమాత్రం తీసిపోని వాగ్దానాలు చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో పాటే మరో 5 కీలక హామీలు ఇచ్చారు. వాటిలో గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి లాంటి పథకాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టో కేవలం వాగ్దానం మాత్రమే కాదని, కర్ణాటక ప్రజలకు మంచి భవిష్యత్తు, సత్వర అభివృద్ధి కోసం తమ నిబద్ధత అని కాంగ్రెస్ చెబుతోంది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ.. హస్తం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఓ అంశం మాత్రం ఆ రాష్ట్ర ఎన్నికలను మరో మలుపుతిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి బజరంగ్‌దళ్, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తామన్న ఒకేఒక్క ప్రకటన ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది. కుల, మత ప్రాతిపదికన వర్గాల మధ్య ద్వేషం వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై బలమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కమలం పార్టీ ఏకిపారేస్తోంది.
బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. శ్రీరాముడు, హనుమంతుని పేర్లను జపించే వారితో కాంగ్రెస్ పార్టీకి సమస్య ఉందన్నారు. హనుమంతుని జన్మస్థలంలో ఉండటం తన అదృష్టం అన్న ప్రధాని.. తాను కర్ణాటకలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ ఇలాంటి ప్రకటన చేయడం దరదృష్టం అన్నారు. ఒక్క మోడీ మాత్రమే కాదు.. అంతకుముందు అస్సాం సీఎం హిమంత సైతం హస్తం పార్టీపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. పీఎఫ్‌ఐపై ఇప్పటికే నిషేధం ఉందని గుర్తు చేసిన ఆయన.. గతంలో సిద్ధరామ య్య ప్రభుత్వం పీఎఫ్‌ఐ కేసులను ఉపసంహరించుకుంది కాబట్టే ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పీఎఫ్‌ఐ, రాడికల్ ముస్లిం సంస్థల మేనిఫెస్టోను పోలి ఉందని అస్సాం సీఎం మండిపడ్డారు.
బీజేపీ విమర్శలు కంటిన్యూ అవుతుండగానే ఢిల్లీలో బజరంగ్ దళ్ మాతృ సంస్థ విశ్వహిందూ పరిషత్ రంగంలోకి దిగింది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై ఆ పార్టీ కార్యాలయం ముందే ఆందోళనలు షురూ చేసింది. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం దగ్గరకు చేరుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియాతో బజరంగ్ దళ్‌ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవా ల్‌గా తీసుకుంటామని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసిన వీహెచ్‌పీ నేతలు సైతం కాంగ్రెస్‌ను హిందూ విరోధిగా అభివర్ణించారు.
ఆర్ఎస్ఎస్ సహా కొన్ని హిందూ సంస్థలపై నిషేధం అనేది చాలా సందర్భాల్లో వినిపించినప్పటికీ అది ఒక పార్టీ వాగ్దానం కిందకు మాత్రం ఎప్పుడూ రాలేదు. కానీ మొదటిసారి ఒక హిందూ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను కాంగ్రెస్ పార్టీయే రద్దు చేసింది. అనంతరం కొద్ది రోజులకు నిషేధం ఎత్తి వేసింది. ఇక అప్పటి నుంచి హిందూ సంస్థలు రద్దైన దాఖలాలు లేవు. అప్పుడు రాజకీయ నేతల నుంచి రద్దుకు సంబంధించిన వ్యాఖ్యలు వచ్చినప్పటికీ పార్టీ నిర్ణయాలుగానో వాగ్దానాలుగానో ఎప్పుడూ మారింది లేదు. మళ్లీ ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టడంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది.
బజరంగ్ దళ్ అనేది విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం. దేశంలో ఆర్ఎస్ఎస్ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ రద్దు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్‌ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇరు వర్గాల మధ్య విధ్వేషాలు సృష్టించడంలో పీఎఫ్ఐ వ్యవహరించిన తీరుగానే బజరంగ్ దళ్ సైతం వ్యవహరి స్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చూస్తుంటే, బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న హామీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేదిగానే కనిపిస్తోంది. ఓ వైపు ప్రీపోల్ సర్వేలన్నీ హస్తం పార్టీకే కర్ణాటక పట్టం కడుతుందని అంచనా వేస్తుంటే.. ఇలాంటి సమయంలో పనికట్టుకుని వివాదాలు కొని తెచ్చుకోవడం ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
కమలం పార్టీ సైతం కాంగ్రెస్ హామీని తనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆ దిశగానే ఆ పార్టీ యాక్షన్ కనిపిస్తోంది కూడా. స్వతహాగా హిందుత్వపార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీకి కాంగ్రెస్ తాజా హామీ ఓ అద్భుత అవకాశమే అవుతుందనేది విశ్లేషకుల మాట. మొత్తంగా.. బజరంగ్ దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చుతూ బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీ కర్ణాటక ఫలితాల ఈక్వేషన్స్‌ను మార్చేసేలానే కనిపిస్తోంది.