తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గవర్నర్ బయట పులి.. అసెంబ్లీలో అడుగుపెడితే మాత్రం పిల్లి అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇంత కాలం కేసీఆర్ పైనా.. తెలంగాణ ప్రభుత్వంపైనా ఘాటు విమర్శలు చేసిన గవర్నర్.. చివరికి అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన పేపర్ చదవాల్సి వచ్చిందన్నాడు. పాపం గవర్నర్ సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చిందనీ.. మళ్ళీ నోరు తెరిస్తే ఆ పేపర్ చదివే పరిస్థితి కూడా పోతుందేమోనని గవర్నర్ భయపడినట్టుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ కేసీఆర్ మధ్య రాజీ కుదిరిందని ఆరోపించిన జగ్గారెడ్డి.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా మారిపోయిందన్నాడు.
శుక్రవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. ప్రారంభోపన్యాసం చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందనీ.. అత్యంత త్వరితగతిన ప్రగతిని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. వాటిని ఆకాశానికెత్తేశారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గత కొంత కాలంగా యుద్ధంలాంటి వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తమిళిసై.. మొత్తానికి వివాదాలేవీ లేకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేయటం విచిత్రమే.
