HomeNATIONAL NEWSదేశ రాజకీయాలను మార్చేసిన కాంగ్రెస్ ఫైల్స్

దేశ రాజకీయాలను మార్చేసిన కాంగ్రెస్ ఫైల్స్

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

దేశంలో ముందెన్నడూ లేని రాజకీయం కనిపిస్తోంది. అదానీ మంటలు, రాహుల్ గాంధీ అనర్హత సెగలు, కరప్షన్ కహానీలంటూ అధికార, విపక్షాల మధ్య అంతకుమించిన రాజకీయం నడుస్తోంది. నిన్న మొన్నటివరకూ అదానీ సెంటర్‌గా కమలనాథులను కాంగ్రెస్ కార్నర్ చేసింది. పార్లమెంట్ సాక్షిగా జేపీసీ డిమాండ్‌తో ఇతర పార్టీలను వెంటేసుకుని అనూహ్యంగా రేసులోకొచ్చి గ్రాండ్ ఓల్డ్ పార్టీ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందనే సంకేతాలిచ్చింది. ఈ సమయంలోనే పరువునష్టం పంచాయితీలో సూరత్ కోర్టు తీర్పు రావడం, రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడ్డం లాంటి పరిణామాలు రాజకీయాన్ని నెక్స్ట్‌ లెవెల్‌కు చేర్చేశాయి. ఈ అంశాన్ని కూడా హస్తం పార్టీ పాజిటివ్‌గా మలుచుకునే ప్రయత్నాలు షురూ చేసింది. గతంలో అంటీముట్ట నట్టున్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేలా యాక్షన్ షురూ చేసింది. కట్‌చేస్తే.. కమలనాథులు కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో అన్నింటికీ చెక్ పెట్టేలా మునుపెన్నడూ లేని రాజకీయానికి తెరలేపారు.
అదానీ అంశాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రయత్నించింది. ఈ అంశంలో బీజేపీకూడా కొంతమేర డిఫెన్స్‌లో పడిందనే చర్చ జరిగింది. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ సమాధానం ఇవ్వకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అదానీ కాదు అంతకు మించిన అవినీతి జరిగింది మీ హయాంలోనే అంటూ తాజా వీడియో రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్‌ పేరిట విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోను కాంగ్రెస్ అంటే కరప్షన్ అంటూ మొదలుపెట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను వీడియోలో ప్రస్తావించారు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో 4లక్షల 82వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఇందులో పేర్కొంది. ప్రజలకు చెందాల్సిన ఇంత సొమ్మును కాంగ్రెస్ నేతలు తిమింగలాల్లాగా తినేసారని కమలం ఆరోపించింది. ఇదంతా మీ సొమ్మే, మీ జేబుల్లో సొమ్మే అంటూ ప్రజలను ఆలోచింపచేసేలా ఈ వీడియో ఉంది.
బీజేపీ చెప్పే దాని ప్రకారం కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి సొమ్ముతో 24 ఐఎన్ఎస్ విక్రాంత్‌లు కొనొచ్చు, 300 రాఫెల్ యుద్ధవిమానాలను సొంతం చేసుకోవచ్చు. వెయ్యి మంగల్ మిషన్స్ చేపట్టొచ్చు. గత కాంగ్రెస్ పాలనను పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు అంటే 2004, 2014 మధ్య దశాబ్ధం పాటు దారుణ అవినీతి జరిగిందని చెప్పుకొచ్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఎప్పుడూ జరగలేదని ఏ పేపర్ చూసినా అవినీతిపై హెడ్‌లైన్స్ అంటూ ఆరోపించింది బీజేపీ. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పైనా బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన్ను మౌనముని అంటూ కామెంట్ చేసింది. అవినీతి కళ్లెదుట కనిపిస్తున్నా ఆయన మౌనాన్ని పాటించారని ప్రజా సొమ్మును రాబందుల పాలు చేసారంటూ ఘాటుగా కామెంట్లు చేసింది బీజేపీ.
అంతేకాదు హెలికాప్టర్ డీల్ కోసం 362 కోట్లు లంచం తీసుకున్నారని, రైల్వే బోర్డు ఛైర్మన్ 12కోట్ల రూపాయల మేర లంచం తీసుకుంటూ దొరికిపోయారని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అదానీకి అండగా ఉంటున్నామన్న అపవాదును పోగొట్టి ఇష్యూను డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే బీజేపీ ఈ వీడియోను విడుదల చేసినట్లు కనిపిస్తోంది. ఐతే వీడియో చివర్లో బీజేపీ మరో ట్విస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ అవినీతి ఇంతటితో అయిపోలేదని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని చెప్పడం ద్వారా త్వరలో మరిన్ని వీడియోలు విడుదల చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. పైగా సీజన్-1 ఎపిసోడ్-1 అని చెప్పడం ద్వారా ఓ సిరీస్‌లా కాంగ్రెస్ అవినీతిపై వీడియోలు బయటపెట్టడానికి బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
తాజాగా జరిగిన సీబీఐ వజ్రోత్సవంలో సైతం ప్రధాని మోడీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప‌దేళ్ల క్రితం అవినీతి చేయ‌డానికి పోటీ జ‌రిగింద‌ని యూపీఏ హ‌యాంను గుర్తు చేశారు. యూపీఏ ఉన్న పదేళ్ల పాటు స్కామ్‌ల టైమ్‌గా అభివ‌ర్ణించారు. ఆ స‌మ‌యంలో నిందితులు భ‌య‌ప‌డ‌లేదని దానికి కార‌ణం వాళ్ల‌కు వ్య‌వ‌స్థ‌లు అండ‌గా నిలిచాయ‌ని ఆరోపించారు. సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్న ఇలాంటి సమయంలో.. న్యాయానికి బ్రాండ్‌గా సీబీఐ ఉంద‌ని, అందుకే, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నార‌ని కామెంట్ చేశారు.
మోడీ, బీజేపీ నేతలు ఈ రేంజ్‌లో కాంగ్రెస్‌ను కార్నర్ చేయడానికి కారణం విపక్షాల ఐక్యత యాక్షనే అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి దేశరాజకీయం మొత్తం విపక్షాల ఐక్యత చుట్టే తిరుగుతోంది. నిన్నమొన్నటివరకూ బీజేపీయేతర పార్టీలు ఒక్కటయ్యే సీనే లేదనే ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం విపక్షాల ఐక్యత అసాధ్యమేం కాదనే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశంలో బీజేపీయేతర పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటూ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే బీజేపీని ఎంతగా వ్యతిరేకిస్తారో, అంతగా కాంగ్రెస్‌నూ వ్యతిరేకించే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. ఇలాదేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ నేత రాహుల్‌కు మద్దతుగా జట్టు కట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అనర్హత రగడలో రాహుల్‌ గాంధీకి దాదాపుగా ప్రతిపక్షాలన్నీ అండగా నిలబడ్డాయి. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల స్థాయిలో కూడా రాహుల్‌కు మద్దతు పెరిగింది. ఒడిశాలోని బిజూ జనతాదళ్‌, ఏపీలోని వైసీపీ మినహా.. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలన్నీ రాహుల్‌ గాంధీకి మద్దతు ప్రకటించాయి.
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పిలుపు మేరకు గత నెల 27న జరిగిన నిరసన ప్రదర్శనల్లో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌‌కు దూరంగా ఉండే టీఎంసీ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. అలాగే, దేశంలో రాజకీయనేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మిగిలిన పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ దూకుడుగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఐతే ఒక్క లక్షద్వీప్‌కు చెందిన మహమ్మద్‌ ఫైజల్‌ మినహా ఎవరిపైనా ఇటీవలి కాలంలో అనర్హత వేటు పడలేదు. తాజాగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో సామాన్య ప్రజల్లో కూడా రాహుల్‌పై సానుభూతి పెరిగిందనే చర్చ జరుగుతోంది. రాహుల్‌‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ టార్గెట్‌ చేసిందన్న అభిప్రాయం జనంలో కలిగిందనీ.. దీన్ని గుర్తించే సైద్ధాంతికంగాకాంగ్రెస్‌తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం రాహుల్‌కు అండగా నిలుస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అనర్హత వివాదమే కీలకాంశంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రాహుల్‌పై అనర్హతకు ముందువరకూ బీజేపీ కూడా విపక్షాల ఐక్యతను లైట్ తీసుకుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బీజేపీయేతర పార్టీలు ఒక్కటయ్యే ప్రమాదం లేకపోలేదని గ్రహించినట్టు కనిపిస్తోంది. అందుకే గ్రాండ్‌ ఓల్డ్ పార్టీపై కమలనాథులు గేర్ మార్చినట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హస్తం పార్టీని దెబ్బకొట్టేందుకు, ప్రజల్లో కాంగ్రెస్ అవినీతిపై చర్చ జరిగేలా మూడు నిమిషాల వీడియో వదిలిందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఫైల్స్ పేరిట మరిన్ని వీడియోలు వదలడం ద్వారా కాంగ్రెస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి కల్పించాలన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది. తద్వారా విపక్షాల ఐక్యతకు గండికొట్టడంతో పాటు అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరయ్యేలా చేయడమే కమలం పార్టీ లక్ష్యం అనే చర్చ జరుగుతోంది. అందుకే రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని మాస్టర్ స్ట్రాటజీగా అభివర్ణిస్తున్నారు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...