జనసేనాని వారాహి రోడ్డెక్కేసింది. ఇక మిగిలిందంతా ప్రజాక్షేత్రం అసలైన రాజకీయం షురూ చేయడం ఒక్కటే. ఇందులో భాగంగానే కొండగట్టు అంజన్న సాక్షిగా ఏపీలో పొత్తులు, తెలంగాణలో పోటీపై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ, ఆ క్లారిటీలోనూ అంతులేనంత కన్ఫ్యూజనుంది. బీజేపీతో కలిసే ఉన్నా అంటూనే మిగిలిన పొత్తులపై ఎన్నికలకు జస్ట్ వారం ముందు తేలుతుందన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అంటూనే 7 నుంచి 14 స్థానాల్లో పోటీ అంటున్నారు. ఈ రెండు విషయాల్లో సేనానికి క్లారిటీ ఉంటే ఉండొచ్చు. కానీ, కేడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళతాయన్నదే అసలు ప్రశ్నంతా.
ఓటు బ్యాంక్ చీలకూడదు.. స్థానాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తే రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. పూర్తిస్థాయి పొత్తులపై క్లారిటీ వచ్చేందుకు టైం పడుతుందని చెప్పినా పొత్తులతోనే వెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉన్నారనడానికి ఇటీవల జరిగిన పరిణామాలే ఎవిడెన్స్. ఐతే అసలు మెలికంతా ఇక్కడే ఉంది. తెలంగాణలో పోటీ అంశాన్ని కాస్త పక్కనపెడితే.. ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి సీన్ మరోలా కనిపిస్తోంది. పవన్ బీజేపీతో పొత్తులోనే ఉన్నామని కొండగట్టు సాక్షిగా క్లారిటీ ఇచ్చిన వేళ.. ఏపీ బీజేపీ యాక్షన్ మాత్రం మరోలా కనిపిస్తోంది. ఆ పార్టీ పొత్తులపై ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడంలేదు. వైసీపీ, టీడీపీలతో పొత్తు ఉండదని భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జనసేనతో పొత్తు విషయంపై ఈ సమావేశంలో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. టీడీపీ, వైసీపీలతో పొత్తు పెట్టుకునేదే లేదని బీజేపీ తీర్మానం చేయడంతో.. ఆ రెండు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. ఇటు జనసేనతో పొత్తుపై కూడా బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ మాత్రం టీడీపీతో పొత్తుకు బీజేపీని కూడా ఒప్పిస్తానంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీడీపీతో పొత్తుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అడ్డుగా ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు.. గత మూడేళ్లుగా బీజేపీ, జనసేన కలిసి ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా అరుదు. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తు అంటూ వినిపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కలిసి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశాయి. అక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో అప్పట్నుంచే బీజేపీ ఢిల్లీ పెద్దలు సేనానిని లైట్ తీసుకున్నారనే చర్చ జరిగింది. కానీ, ఇప్పటికీ ఢిల్లీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానంటూ పవన్ పదే పదే ప్రకటిస్తున్నారు. మొత్తంగా.. తెలంగాణలో పోటీపై వచ్చినంత క్లారిటీ ఏపీలో పొత్తులపై మాత్రం వచ్చినట్టు కనిపించడం లేదు. దీనిపై సేనాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఏపీ రాజకీయాల్లో మాత్రం అంతా కన్ఫ్యూజనే నడుస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.