అగ్నిప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న దక్కన్ మాల్ బిల్డింగ్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తుండగా పెను ప్రమాదం తప్పింది. క్రేన్ తో భవనాన్ని కొద్దికొద్దిగా కూల్చేస్తున్న క్రమంలో.. పిల్లర్లు వీక్ గా ఉండటంతో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు షాకయ్యారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కన ప్రాంతాలను ఖాళీ చేయించటంతో ఎవరికీ ఏమీ కాలేదు. అధికారులు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.
భవనాన్ని ఆనవాళ్ళు లేకుండా కూల్చేయాలంటే కుప్పలన్నీ ముందు అక్కడి నుంచి తొలగించి.. భవనం లోపలి ప్రాంతాలకు వెళ్ళి కూల్చివేత కొనసాగించాల్సి ఉంది. భవనం కుప్పకూలిపోవటానికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ సంభవించి దక్కన్ స్టోర్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బిల్డింగ్ కూల్చివేత పనులు ఇంకా మిగిలే ఉన్నాయి.