ఏపీలో పొత్తులపై జనసేన, తెలుగుదేశం పార్టీ ఇదివరకే ఫుల్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కలిసే ఎన్నికలకు వెళ్తామని రెండు పార్టీల నుంచి స్పష్టత వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకూ సీట్ల పంపకాల విషయంలో మాత్రం అటు పవన్ కళ్యాణ్ కు, ఇటు చంద్రబాబుకు ఏ క్లారిటీ లేదు. జనసేన కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతున్నాడు.. వాటిలో తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లు ఎన్ని.. ఎన్ని స్థానాలను వదులుకోటానికి చంద్రబాబు ఒప్పకున్నాడు.. ఇలాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. పొత్తు ఖరారైనా ఇప్పటికీ సీట్ల పంపకాల విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ప్రస్తుతం ఓ వార్త మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన, టీడీపీ రెండు పార్టీల కీలక వ్యక్తుల మధ్య సీట్ల పంపకం విషయంలో భేటీ జరిగిందనేది ఆ వార్త సారాంశం.
కులం ప్రాతిపదికన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా వరకు సీట్లను జనసేన అడిగిందని సమాచారం. గోదావరి జిల్లాల్లో పవన్ కు మద్దతు ఎక్కువ కాబట్టి ఆ రెండు జిల్లాలో అధిక శాతం స్థానాలను జనసేన అడిగిందట. ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సామాజికవర్గం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే సీట్ల పంపకానికి ప్రతిపాదనలు జరిగినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే.. మొదటి రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది జనసేన ప్రధాన డిమాండ్ అని సమాచారం. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే గెలుపు కాస్త కష్టమే అన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు బలంగా వినిపిస్తున్న వేళ.. జనసేనను పక్కన పెట్టి టీడీపీ ఒంటరి పోరు చేయదు. అలాంటప్పుడు జనసేన రెండున్నరేళ్ళ పాటు సీఎం సీటు అడగటంలో తప్పేమీలేదన్న మాట కూడా వినిపిస్తోంది. కాకపోతే చంద్రబాబు ఈ డిమాండ్ కు ఒప్పుకున్నాడా లేదా అనేదానిపై స్పష్టత మాత్రం లేదు.