తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ మధ్య అభిప్రాయ విభేధాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. కానీ.. బీజేపీ నేతలు ఎప్పుడూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు సరికదా.. తామంతా బండి సంజయ్ అధ్యక్షతనే కలిసి మెలిసి పనిచేస్తున్నామంటూ మాట దాటవేస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు రావటం.. ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్ళటానికి సిద్ధపడటంతో తెలంగాణ బీజేపీలో ఏదో భారీ మార్పే జరగబోతోదంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి చేరికల కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీలో కీలక పదవి ఢిల్లీ అధిష్టానం కట్టబెట్టేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో బీజేపీని సరైన దిశలో బండి సంజయ్ నడిపించలేకపోతున్నాడనీ.. అన్నీ తానే అన్నట్టుగా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుండటంతో కొంత మంది కీలక నేతలు నొచ్చుకుంటున్నారనీ బీజేపీ ఢిల్లీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. బీజేపీలోకి కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ పట్ల బండి సంజయ్ వ్యవహార శైలి బాగాలేదనీ.. ఈ విషయంపై ఈటెల అసంతృప్తితో ఉన్నారని కూడా ఢిల్లీ పెద్దలకు సమాచారం అందిందట. ఈటెలకు సరైన గౌరవం లభించకపోవటం వల్లనే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కొత్తగా ఎవరైనా రావాలంటే ఆలోచిస్తున్నారని తెలిసిందట. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి కీలక నేతలను ఆకర్షించి పార్టీలో చేర్చుకునే బాధ్యత ఈటెల రాజేందర్ పై ఉండగా.. బండి సంజయ్ వ్యవహార శైలి వల్లనే కొత్తగా పార్టీలోకి ఎవరూ రావటం లేదనే వార్తపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ చేశారట. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటెలను ఆ పదవిలో కూర్చోబెడతారని బీజేపీ నాయకులే చెప్పుకోవటం కనిపిస్తోంది. కానీ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చబోరనీ.. కాకపోతే ఈటెలకు అధ్యక్ష పదవి స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టే అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా వినిపిస్తోంది. మరో వారం రోజుల్లో బీజేపీ కీలక పదవులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.