కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై అనుమానాస్ఫదంగా కనిపించిన బెలూన్ ను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. కూల్చివేసిన తర్వాత అది చైనాకు చెందిన నిఘా బెలూన్ అని.. అమెరికా అంతర్గత రహస్యాలు తెలుసుకునేందుకు చైనా పన్నిన కుట్ర అనీ అమెరికా తేల్చింది. బెలూన్ ను కూల్చివేసిన తర్వాత దాని శకలాలను సేకరించిన అమెరికన్ ఇంటలిజెన్స్ అధికారులు బెలూన్ ఏ వివరాలు సేకరించగలిగింది.. ఎలా పనిచేస్తుంది అనే వివరాలు తెలుసుకోగలిగారు. అయితే.. ఆ వివరాలను అమెరికా ఇన్ని రోజులు వెల్లడించలేదు. తాజాగా చైనా స్పై బెలూన్ కు సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి అందజేశారు. అమెరికా-భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ కోప్ ఇండియా 23 సైనిక విన్యాసాలలో భాగంగా ఢిల్లీలో భేటీ అయిన ఇరుదేశాల సైనికాధికారులు ఈ విషయంపై చర్చించటంతో పాటు నిఘా బెలూన్ వివరాలను అందజేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌద్రీ, అమెరికన్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్ బాష్ మధ్య జరిగిన సమావేశం అనంతరం కెన్నిత్ ఇండియన్ మీడియాతో మాట్లాడారు. చైనా స్పై బెలూన్ కు సంబంధించిన సీక్రెట్ డిటైల్స్ ను భారత అధికారులతో పాటు మరి కొన్ని దేశాలకు కూడా అందజేశామని చెప్పారు. భారతదేశంలోని అండమాన్ సమీపంలో కూడా ఇలాంటి నిఘా బెలూన్ ను మన ఆర్మీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, భారత్ దేశాలతో చైనాకు ఉన్న సంబంధాలు బలహీనమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తైవాన్ పై చైనా సైనిక చర్యకు దిగబోతోందన్న వార్తల నేపథ్యంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చనున్నాయి. తైవాన్ విషయంలో చైనా హద్దుమీరితే యుద్ధంలోకి అమెరికా సహా నాటో దేశాలు ప్రవేశిస్తాయి. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు రావచ్చనేది అంతర్జాతీయ విశ్లేషకుల భావన.