మిత్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకున్నా పర్వాలేదు, సమస్యగా మాత్రం మారకూడ దు. కానీ, పాకిస్తాన్ విషయంగా డ్రాగన్ యాక్షన్ ఆ రెండో యాంగిల్‌లోనే ఉంది. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం పాకిస్తాన్‌ను కుదిపేస్తున్న వేళ.. ఆ దేశ సరిహద్దుల్లో కాచుక్కూర్చున్న తాలిబన్లకు బీజింగ్ అస్త్రశస్త్రాలను అందిస్తోంది. అవి కూడా సాధారణ ఆయుధాలు కాదు.. ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ వెపన్స్. ఈ విషయంలో బీజింగ్ ఏదయినప్పటికీ నష్టం జరిగేది మాత్రం పాకిస్తాన్‌కే. ఇంతకూ, షెహబాజ్ సర్కార్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తాలిబన్లకు డ్రాగన్ ఎందుకింత దగ్గరవుతోంది? సొంత ప్రయోజనాల కోసం మిత్రదేశాన్ని బలివ్వాలనుకుంటుందా? వీటన్నింటికీమించి తాలిబన్లకు ఆయుధాలివ్వడంలో మరో కుట్రకోణమేదైనా దాగి ఉందా?
ప్రపంచం మొత్తం ఒక దారిలో నడిస్తే.. డ్రాగన్ కంట్రీ మరో రూట్‌లో నడుస్తుంది. ఎవరేమనుకున్నా సొంత ప్రయోజనాల కోసం ఎన్ని కుట్రలయినా చేస్తుంది. తననే నమ్ముకున్నోళ్లు నిండా మునిగిపోయినా, నాశనమైపోయినా బీజింగ్‌కు పట్టదు. తాను అనుకున్నది నెరవేరితే అంతే చాలు. ఇప్పుడు కూడా చైనా అదే చేస్తోంది. భారత్‌ను నేరెగా ఎదుర్కొనే దమ్ములేక పాకిస్తాన్‌ను చేరదీసిన బీజింగ్.. చివరికి ఆ దేశం నిండా మునిగిపోతున్న వేళ సాయం చేయాల్సిందిపోయి, మరింతగా సతాయిస్తోంది. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ మరింత ఇబ్బందిపడేలా తాలిబన్లకు దగ్గరవుతోంది. పాకిస్తాన్ బోర్డర్ లో కాచుక్కూర్చున్న నయా కాలకేయులు తాలిబన్లకు మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఆయుధాలు అందిస్తోంది. దీని ఉద్దేశం ఏదైనా రిస్క్ మాత్రం పాకిస్తాన్‌కే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దీంతో ప్రపంచం మొత్తం మరోసారి బీజింగ్ తీరును విమర్శిస్తోంది.
నిజానికి.. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనను, అరాచక చర్యలను ప్రపంచమంతా ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. కానీ, చైనా మాత్రం తాలిబన్లకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోంది. గతంలో అప్ఘన్‌ను అమెరికా దళాల నుంచి ఆక్రమించుకుని.. తాలిబన్లకు అప్పగించడంలో తెర వెనక కీలక పాత్ర పోషించిన చైనా ఇప్పుడు తాలిబన్ల పాలనను స్థిరీకరించేందుకు సాయం చేస్తోంది. ఇందులో భాగంగానే తాలిబన్లకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. తాలిబన్ల నీడలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు.. పుస్తకం రచయిత జాఫర్ ఇక్బాల్ యూసఫ్ జాయ్ ఈ సంచలన విషయాన్ని ఇటీవలే తెలిపారు. కాబూల్‌లో గత డిసెంబర్ 12న ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు ఓ హోటల్‌పై దాడిచేశారు. చైనీయుల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ హోటల్‌లో బసచేసిన వారిలో ఎక్కువమంది చైనీయులే. హోటల్ నిర్వాహకులు కూడా చైనీయులే. మొత్తం 18మంది గాయపడ్డారు. చైనా ప్రతినిధులు, వ్యాపారులు ఈ హోటల్‌కు తరచుగా వస్తుంటారు. ఈ ఘటన తర్వాత చైనా.. తాలిబన్ల ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతుగా ఉండేందుకు సిద్ధమైంది. ఉగ్రవాదులను తాలిబన్లు సమర్థవంతంగా ఎదుర్కొంనేందుకు మానవ రహిత విమానాలు సహా అత్యాధునిక ఆయుధాలు అందిస్తోంది. అయితే, ఈ వ్యవహారం చైనీయులను కాపాడుకోడానికి మాత్రమే కాదు.
అప్ఘానిస్థాన్‌తో చైనాకు అనేక ప్రయోజనాలున్నాయి. అప్ఘన్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. గల్ఫ్, ఇరాన్‌తో చైనాను కలిపేది అప్ఘానిస్తానే. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ వంటివాటికి అప్ఘన్ కీలకమైనది. అందుకే తాలిబన్లకు మానవతాసాయం, ఆయుధసాయం అందించడంతో పాటు తాలిబన్ల పాలనకు ప్రపంచం మద్దతు కూడగట్టేందుకు బీజింగ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2021లోనే మానవరహిత ఏరియల్ వాహనాలు, డ్రోన్లు చైనా తాలిబన్లకు అందించింది. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాతి నెలే.. ఈ అమ్మకాలు జరిగాయి. నిజానికి.. రెండు దశాబ్దాల తర్వాత అప్ఘన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడంలో చైనా పాత్ర ఉందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. తాలిబన్ల తెరవెనక బీజింగ్ అన్నీ తానై వ్యవహరించిందని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు. పాకిస్థాన్ తెర ముందు ఉంటే.. తెర వెనక చైనా తాలిబన్లకు సహాయ సహకారాలు అందించాయని తెలిపారు. ఐతే, ఇప్పుడు ఆప్ఘన్‌పై చైనా వైఖరితో పాకిస్తాన్ ఇబ్బందులు పడుతోంది. ఇటీవలి కాలంలో పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో తాలిబన్లకు ఆయుధాలు ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు.
చైనా తాలిబన్లకు దగ్గరవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆఫ్ఘన్ భూభాగంలో నిక్షిప్తమైన ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజాలు కొల్లగొట్టడమే. ఇందులో భాగంగానే ఈటీవలే తాలిబన్లతో దాదాపు 150 మిలియన్ డాలర్ల విలువైన డీల్ సైతం చేసుకుంది. ఈ డీల్ ద్వారా అము నదీ పరీవాహక ప్రాంతంలో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో చమురు అన్వేషణ, వెలికితీత జరుగుతాయి. ఈ డీల్ ద్వారా దాదాపు 12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతుంది. ఆ తర్వాత మూడేళ్ల పాటు 540 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతుంది. మొత్తం ఐదు చమురు బావులు, సహజవాయువు బ్లాక్స్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ ఐదు బావుల్లో దాదాపు 8.7 కోట్ల బ్యారెల్ ముడి చమురు ఉన్నట్టు గతంలో సర్వేలు వెల్లడించాయి. దీంతో రోజూ ముడి చమురు ఉత్పత్తి 200 టన్నులు కానుంది. ఆ తర్వాత అది వెయ్యి టన్నులకు పెరుగుతుంది. ఇప్పుడు చైనా టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని గుల్ల చేసి ట్రిలియన్ డాలర్ల విలువైన ఈ నిక్షేపాలన్నింటినీ దోచేయడమే. డ్రాగన్ యాక్షన్‌పై తాలిబన్లకు అవగాహన ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు అవసరమైన నిధుల కోసం, అంతర్జాతీయ మద్దతు కోసం బీజింగ్‌తో దోస్తీకి సిద్ధమవుతున్నారు.
మరోవైపు.. అవకాశవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జిన్‌పింగ్ సర్కార్ తాలిబన్లను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఇండియాను టార్గెట్ చేయొచ్చనే కుట్రలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. నిజానికి.. పాక్‌తో దోస్తీ చేయడానికి కారణం కూడా ఇదే. ఆ దేశ ఉగ్రవాదులతో దేశంలో అలజడి సృష్టించడమే డ్రాగన్ లక్ష్యమన్నట్టుగా బీజింగ్ వైఖరి కనిపించింది. చాలా సందర్భాల్లో మోస్ట్ వాండెట్ పాకిస్తాన్ టెర్రరిస్టులకు అంతర్జాతీయ వేదికలపై అండగా నిలుస్తూ వచ్చింది కూడా. తీరా ఇప్పుడు పాకిస్తాన్ పనైపోడంతో తాలిబన్లవైపు దృష్టి సారించడం మొదలు పెట్టింది. ఆఫ్ఘన్ తాలిబన్లకు దగ్గరై పొరుగు దేశాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం కూడా కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భారత్‌పై తాలిబన్లను ఉసిగొల్పే ప్రయత్నాలు చేయొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రపంచం కాదన్న తాలిబన్లతో డ్రాగన్ దోస్తీని ఓ కంట కనిపెట్టాల్సిందే.
భారత్ పై చైనా మరో కుట్ర : తాలిబన్ల చేతికి డేంజర్ వెపన్స్
Published on