HomeINTERNATIONAL NEWSఇండియన్ పాపులేషన్ పై చైనా ఏడవటానికి కారణమిదే..!

ఇండియన్ పాపులేషన్ పై చైనా ఏడవటానికి కారణమిదే..!

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

“క్వాంటిటీ కాదు.. క్వాలిటీనే ఇంపార్టెంట్”. ఈ మాటంది మరెవరో కాదు డ్రాగన్ కంట్రీ చైనా. అదికూడా మన దేశాన్ని ఉద్దేశించే. దీనికి కారణం జనాభాలో ఇండియా చైనాను బీట్ చేయడమే. ఇప్పటికే జనాభా కొరతతో తిప్పలు పడుతున్న డ్రాగన్.. తాజా పరిణామాలను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. ఫలితంగా ఇండియన్లలో కష్టించే తత్వం లేదంటూ కౌంటర్లేస్తోంది. చైనా కడుపుమంటను కాస్త పక్కనపెట్టేస్తే.. మన దేశంలోనూ చాలా మందికి పెరుగుతున్న జనాభాతో ఏం జరగబోతోందనే ఆందోళన కనిపిస్తోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా.. ఈ మూడు దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనాభా తగ్గుదల. ఈ దేశాల్లో జననాల రేటు దారుణంగా పడిపోయింది. చైనా, జపాన్‌లో అయితే వృద్ధుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ రెండు దేశాలు మాత్రమే కాదు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా వృద్ధాప్యమే. ఏ దేశంలో ఐనా జననాల రేటు పడిపోయి వృద్ధుల సంఖ్య పెరిగితే అప్పుడే వాటి పతనం మొదలయినట్టు. అందుకే, జనాభా రేటు తగ్గుతుందని తెలియగానే ఆయా దేశాలు ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పిల్లల్ని కనండి మహా ప్రభో అని ప్రజలను మొత్తు కుంటాయి. ప్రస్తుతం చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల పరిస్థితి అలాగే ఉంది. జిన్‌పింగ్ సర్కార్ ఐతే కాలేజీ విద్యార్థులకు ప్రేమించుకోండి అంటూ ప్రత్యేక సెలవులు ఇస్తోంది. ఒక్క సెలవులేంటి? పెళ్లి కాకుండానే పిల్లల్ని కనే అవకాశంతో పాటూ ఆ పిల్లల పెంపకానికయ్యే ఖర్చుల వరకూ అన్నింట్లో అండగా ఉంటోంది. ఈ పాట్లన్నీ జననాల రేటు పెంచుకోవడం కోసమే. కానీ, ఆశించిన ఫలితాలు మాత్రం ఆ దేశంలోనే కాదు మరే దేశంలోనూ కనిపించడం లేదు. ఒక్క ఇండియా విషయంలో తప్ప..!
ప్రపంచ జనాభాలో ఇప్పుడు మనమే నెంబర్‌ వన్. ఇప్పట్లో మనల్ని కొట్టేవారే లేరు. ఉండరు కూడా. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86కోట్లు.. అది చైనాకంటే 29 లక్షలు అధికం.. ఇంకాస్త గట్టిగా చెప్పాల్సి వస్తే, ప్రపంచ జనాభాలో ఐదోవంతు మన దగ్గరే ఉంది. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలు ఉండగా.. 34 కోట్ల జనాభాతో అమెరికా ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గతేడాది నుంచి చైనా జనాభా తగ్గుదల మొదలు కాగా.. ఎప్పట్లాగే భారత జనాభా పెరుగుతుండటంతో.. మన దేశం డ్రాగన్‌ను వెనక్కి నెట్టి జనాభా విషయంలో మొదటి స్థానానికి చేరుకుంది. వాస్తవానికి..భారత్‌లో చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. 2021లో జన గణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్-19 కారణం గా ఆలస్యమైంది. దీంతో భారత్ సరిగ్గా ఏ రోజున చైనాను దాటేసిందనే విషయాన్ని చెప్పలేమని ఐక్యరాజ్య సమితి అధికారులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 804.5 కోట్ల మంది నివసిస్తుండగా.. అందులో మూడొంతుల జనాభా ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నారు. గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా గత ఏడాది చైనా జనాభా తగ్గింది. 2022లో చైనాలో నమోదైన జననాల కంటే మరణాల సంఖ్యే ఎక్కువ.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ డేటా ప్రకారం భారత జనాభాలో 25శాతం 0-14ఏళ్ల మధ్య వయసువారే. ఇక 10నుంచి 19 ఏళ్ల వయసున్నవారు 18శాతం. అదే 10నుంచి 24 ఏళ్లను తీసుకుంటే 26శాతం జనాభా వారే.. ఇంకా చెప్పాలంటే సగం జనాభా 30ఏళ్లలోపు వారే.. కొన్ని లెక్కల ప్రకారం కేరళ, పంజాబ్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో యువజనాభా కనిపిస్తోంది. ఈ లెక్కల ప్రకారం మరో మూడు దశాబ్దాల పాటు జనాభాలో మనల్ని కొట్టేవారుండరు.. ఇదే ఊపులో పెరుగుతూ పోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 165కోట్ల మార్కును టచ్ చేస్తాం. ఆ తర్వాత నుంచి తగ్గుదల మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. 2050నాటికి మన జనాభా 165కోట్లకు చేరితే చైనా జనాభా 131కోట్లకు పడిపోతుందని చెబుతున్నారు. నిజానికి.. ప్రపంచజనాభా వయసు పెరుగుతోంది. కానీ మన దగ్గర మాత్రం యువజనాభా పెరుగుతోంది. అంటే వర్క్‌ఫోర్స్‌ అంతా మన దగ్గరే ఉండబోతోంది. చైనాలో కఠినమైన ఆంక్షల కారణంగా గత కొన్ని దశాబ్దాల్లో జనాభా తగ్గిపోయింది. వయసుపైబడిన వారి సంఖ్య పెరిగింది. యువజనాభా తగ్గింది. అదే ఇప్పుడు ఆ దేశం కొంపముంచింది. అందుకే ఒక్కసారిగా జనాభాను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాకు వయసే ఇప్పుడు అడ్వాంటేజ్. మన జనాభాలో పావుశాతం 14ఏళ్లలోపు వారే. అంటే మరో రెండు దశాబ్దాలు వారివే. మిగిలిన దేశాల్లో జనాభా తగ్గుదల కారణంగా మన యంగ్ ఇండియానే గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌గా మారుతుందనడంలో అనుమానమే అక్కర్లేదు.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలవడం పట్ల చైనా ఎప్పట్లానే
కడుపుమంట బయటపెట్టుకుంది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వెన్‌బిన్.. జనాభా ఎంత ఎక్కువ అనేదాని కంటే ఎంత నాణ్యమైన జనాభా ఉందనేదే ముఖ్యమంటూ కన్నింగ్ కామెంట్ చేశారు. జనాభా ముఖ్యమే గానీ.. టాలెంట్ కూడా ముఖ్యమేనన్నారు. తమ దేశంలో ఇప్పటికీ 90 కోట్ల మంది పని చేసే ప్రజలు ఉన్నారని.. తమ దేశాభివృద్ధి కోసం వారు ఇతోధికంగా శ్రమిస్తున్నారని వాంగ్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘చైనాలో దాదాపు 90 కోట్ల మంది పని చేసే వారుండగా.. ఏటా కోటిన్నర మంది కొత్తగా శ్రామికవర్గంలో చేరుతున్నారు. చైనాలో 24 కోట్ల మందికిపైగా ఉన్నత విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రామిక వర్గంలో చేరుతున్న వారు సగటున 14 ఏళ్లు చదువుతున్నారని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ కూడా కామెంట్ చేశారు. పైకి ఇలాంటి లెక్కలు చెబుతున్నప్పటికీ డ్రాగన్ దేశంలో వాస్తవ పరిస్థితులు మాత్రం అవి కావు.
2022లో చైనా జనాభా 8 లక్షల 50 వేలు తగ్గింది. చైనా జనాభా పెరుగుదల రేటు మైనస్ 0.6 శాతంగా నమోదైందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 జనవరిలోనే ప్రకటించింది. నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నాటికి చైనాలో 60 ఏళ్లు దాటిన జనాభా 26.4 కోట్లుగా ఉంది. ఈ రెండు మూడేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2035 నాటికి చైనాలో 40 కోట్ల మంది వృద్ధులు ఉండనున్నారు. ఇది అప్పటి చైనా జనాభాలో 30 శాతం ఉండనుండటం ఆ దేశ పాలకులను ఇప్పటికే టెన్షన్ పెడుతున్న అంశం. వృద్ధుల సంఖ్య పెరిగేకొద్దీ పని చేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు వయసు మీద పడిన వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేసే ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా.. ప్రపంచతయారీ కేంద్రంగా ఉన్న చైనా క్రమంగా వెనకడుగులు వేయాల్సి వస్తుంది. ఇప్పటికే చైనా నుంచి ప్రపంచ స్థాయి కంపెనీలు బయటకొచ్చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ యాపిల్ సంస్థే. ఇప్పటివరకూ 95శాతం యాపిల్ ప్రోడక్ట్స్‌ చైనాలోనే తయారయ్యేవి.. ఇప్పుడు 25శాతం ఇండియాలో తయారీ చేయాలని ఆ సంస్థ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ముంబై, ఢిల్లీలో రిటైల్ స్టోర్స్ సైతం ప్రారంభించింది. దీనికోసం స్వయంగా యాపిల్ సీఈవో ఇండియాకు వచ్చారు. ప్రధాని మోడీతో సైతం సమావేశమై దేశ వ్యాప్తంగా పెట్టుబడులకు సిద్ధం అని ప్రకటించారు. ఇదంతా యంగ్ ఇండియాను దృష్టిలో ఉంచుకునే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మరోవైపు.. మన దేశంలో దాదాపు 50శాతం మంది 30 ఏళ్లలోపు వారే కావడం, వారంతా పని చేసే ఏజ్ గ్రూప్‌కి చెందిన వారే కావడం ఇండియాను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తుంది. అయితే, మన దేశ యువ జనాభాను, వనరులను సక్రమంగా వాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేయగలిగితే భారత ప్రస్తుత జీడీపి 3.5 ట్రిలియన్ల నుంచి 2030నాటికి 9 ట్రిలియన్లకు, 2047నాటికి 40 ట్రిలియన్ల టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టమేం కాదనేది ఆర్ధిక రంగ నిపుణులు కూడా చెబుతున్న మాట. ఇదే సమయంలో మేథో వలసకు అడ్డుకట్ట వేయడం, సంపన్నులు దేశంవిడిచి వెళ్లకుండా చూడటం లాంటి సవాళ్లను కూడా భారత్ అధిగమించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి.. డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలోనే రెండో ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణాలు కూడా ఇవే. డ్రాగన్ దేశం ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడంతో ఆ దేశ యువతదే కీలక పాత్రగా చెబుతారు. ప్రపంచ స్థాయి సంస్థలు డ్రాగన్ దేశంలో పెట్టుబడులు కుమ్మరించటానికి కూడా చైనాలో యువత అధికంగా ఉండటమే. కానీ, వన్ చైల్డ్‌ పాలసీని తెచ్చి ఆ అవకాశాలను చైనా ఇప్పుడు చేజేతులా పోగొట్టుకుంటోంది. ఇప్పుడు అదే అంశం ఇండియాకు వరం కాబోతోంది.
ఇదే సమయంలో జనాభా పెరుగుదల కొన్ని ఇబ్బందులను కూడా కొనితేవడం ఖాయం. జనాభా వేగంగా పెరగడంతో ఆకలి, పేదరికం, నిరుద్యోగం లాంటి సవాళ్లను ఏ దేశమైనా ఎదుర్కోక తప్పదు. ప్రజలకు సరైన వైద్యం అందడం, నాణ్యమైన విద్య అందించడం కష్టం అవుతుంది. ఇండియా లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇవి కాస్త ఇబ్బంది పెట్టే సవాళ్లే. అయితే, కోవిడ్ లాంటి పరిస్థితులను అధి గమించడంలో విజయం సాధించిన భారత్‌.. క్రమంగా ఎదురయ్యే జనాభా పెరుగుదలను హ్యాండిల్‌ చేయడంలో తడబడే పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తంగా.. ఇండియన్ యంగ్ స్టర్లకు ప్రపంచాన్ని శాసించే టైం ఐతే వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ సమయంలో కావాల్సిందల్లా మోడీ సర్కార్ ప్రోత్సాహం ఒక్కటే. ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి సంస్కరణలతో ఆ దిశగా ఇప్పటికే తయారీ రంగంలో దూసుకుపోతున్న వేళ, యాపిల్ మాదిరిగానే మరిన్ని ప్రపంచ స్థాయి సంస్థల ఇండియా ఎంట్రీకి లైన్ క్లియర్ అయితే అద్భుతం జరగడం ఖాయం. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...