కరోనా కల్లోలం నుంచి కోలుకునే పనిలో డ్రాగన్ బిజీబిజీగా ఉందనే అందరూ అనుకుంటున్నారు. బీజింగ్ బిజీగానే ఉంది కానీ, కోవిడ్ నివారణ చర్యల్లో కాదు. ప్రత్యర్ధులపై పావులు కదపడంలో. ఔను.. ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌లో టాప్ జనరల్ అంచనా వేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. తైవాన్ ఆక్రమణకు, అమెరికాపై యుద్ధానికీ ఒక్కసారే సిద్ధమయ్యేలా బీజింగ్ గ్రౌండ్‌వర్క్ చేస్తున్నట్టు ఆ జనరల్ అంచనా వేశారట. “డ్రాగన్ ఏ క్షణానైనా దండెత్తే ఛాన్స్ ఉంది.. యుద్ధానికి సిద్ధం కావాలంటూ అధికారులకు అంతర్గతంగా లేఖలు సైతం పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో రాసింది.
మైక్ మినిహాన్ అనే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ టాప్ జనరల్ దీనిపై సైన్యాధికారులకు లేఖలు రాశాడు. ఆ లేఖల్లోని సారాంశమేంటంటే.. బీజింగ్ ఏ క్షణానైనా అమెరికాపై దండెత్తొచ్చని. ఫలితంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ యుద్దం లక్ష్యం చైనాను అడ్డుకోవడమేనని.. లేదంటే డ్రాగన్‌ను ఓడించడమేనని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తన అంచనా తప్పు కావొచ్చంటూనే.. 2025లో బీజింగ్‌తో కచ్చితంగా పోరాడుతామని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని ఆ లేఖలో చెప్పుకొచ్చారు.
ఎయిర్ ఫోర్స్‌లోని ఎయిర్ మబైలిటీ కామాండ్ హెడ్ ఈ జనరల్ మైక్ మినిహాన్.. అతడి కింద 50వేల మంది సైనికులు, 500 యుద్ధ విమానాలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్‌లో టాప్ అధికారి కావడంతో ఇప్పుడు మినిహాన్ లేఖలు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
తైవాన్‌ను టార్గెట్ చేయడం వరకూ ఓకే. కానీ, అగ్రరాజ్యం అమెరికాను బీజింగ్ ఎందుకు లక్ష్యం చేసుకుంటుంది? ఇదేం సమాధానం దొరకని భేతాళ ప్రశ్నేం కాదు. తైవాన్ కావాలంటే బీజింగ్ కచ్చితంగా అమెరికాను ఓడించాలి. లేదంటే తైవాన్‌ను హస్తగతం చేసుకునేలోపే అమెరికా మిస్సైళ్లు బీజింగ్‌ను ధ్వంసం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేస్తాయి. ఇటీవల తైవాన్, చైనా ఉద్రిక్తతల సమయంలో ఇదే మాట వైట్‌హౌస్ పదే పదే చెబుతూ వచ్చింది. దీనికితోడు జిన్‌పింగ్ సేనలు తైవాన్‌ను చుట్టుముట్టిన క్షణాల్లోను అమెరికా అంతకుమించిన యాక్షన్‌ను షురూ చేసింది. తైవాన్ తమదే అనీ, అందులో వేలు పెట్టొద్దంటూ బీజింగ్ పదే పదే హెచ్చరించినా లెక్కచేయకుండా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తూ కవ్వించింది. అంతటితో ఆగకుండా ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ ఏకంగా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైపీలో పర్యటించి డ్రాగన్‌కు సవాల్ చేసింది. ఆ సమయంలో పెలోసీ తైపీలో అడుగుపెడితే తమ యుద్ధ విమానాలు రంగంలో దిగుతాయని హెచ్చరించిన చైనా.. చివరికి ఆ సాహసం కూడా చేసింది. అయితే, పెలోసీ పర్యటనను అడ్డుకోలేక ప్రపంచం ముందు అభాసుపాలైంది. అప్పట్నుంచే తైవాన్‌తో పాటూ అమెరికాను టార్గెట్ చేయడం మొదలైంది.
నిజానికి.. గతేడాది ఆగస్ట్‌లోనే తైవాన్ విషయాన్ని తేల్చేయాలని బీజింగ్ భావించింది. కానీ, అధ్యక్ష ఎన్నికలు జిన్‌పింగ్‌ను ఆపేశాయి. చైనా గత చరిత్రను తిరగరాస్తూ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపైను దృష్టి సారించడంతో తైవాన్ అంశాన్ని కాస్త పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. చివరికి జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలని ఆదేశించడం, అలాగే త్రివిధ దళాల్లో అమెరికాను దాటేసేందుకు ఆయుధాలపై ఫోకస్ చేయడం లాంటి నిర్ణయాలు బీజింగ్ తీసుకుంది. మొదట ఈ పరిణామాలన్నీ భారత్‌పై యుద్ధానికే అని భావించినా.. మైక్ లేఖతో తైవాన్, అమెరికాపై యాక్షన్ కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన సైనిక విన్యాసాలు నిర్వహించడం లాంటి పరిణామా లు చూస్తుంటే మైక్ అనుమానాలే నిజమవుతాయేమో అంటున్నారు మిలటరీ ఎక్స్‌పర్ట్స్ ఏదేమైనా చైనా దూకుడుతో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది.