చంద్రయాన్ 3 ప్రయోగం కోసం భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూశాయి. ఎట్టకేలకు భారత అంతరిక్ష పరిసోధన సంస్థ ఇస్రో విజయవంతంగా రాకెట్ ప్రయోగం పూర్తి చేయగలిగింది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ తో విజయవంతంగా భూమి నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం 2 గంటలకు మూడో దశ ముగిసిందనీ.. ప్రయోగం సక్సెస్ అయ్యిందనీ ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ ప్రకటించారు. ల్యాండర్, రోవర్ మరియు ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తీసుకుని జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి వెళ్లింది జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్.
జీఎస్ఎల్వీ మార్క్ – 3 రాకెట్ చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. అయితే.. ఇది అప్పుడే చంద్రుడి కక్షలోకి ప్రవేశించదు. 24 రోజుల పాటు భూ కక్షలోనే భూమి చుట్టూ చక్కర్లు కొడుతుంది. భూమికి దగ్గరగా తిరగటం మొదలుపెట్టి రాను రాను భూమికి దూరంగా కక్షలో తిరుగుతుంది. అలా కక్షను పెంచుకుంటూ పోయి ఒకానొక దశలో భూమి ఆర్బిట్ చివర్లోకి చేరుతుంది. ఆ తర్వాత రోవర్ లోని మరో ఇంజన్ ను మండించి దాని వేగం పెంచి చంద్రుడి దిశగా దారి మళ్ళిస్తారు. అలా చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి.. అంటే చంద్రుడి ఆర్బిట్ లోకి రోవర్ ప్రవేశిస్తుంది. చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన తర్వాత వేగం తగ్గిస్తారు. అలా చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తూ.. అనువైన సమయంలో చంద్రుడిపై ల్యాండింగ్ దిశగా వెళ్తుంది. ఆగష్టు 23 లేదా 24 తేదీలలో ఈ రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో చెప్తోంది.
ల్యాండింగ్ సమయంలో ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ చంద్రుడి నేల దిశగా గంటకు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నేలకు చేరే కొద్దీ నాలుగు ఇంజన్లను ప్రయాణానికి వ్యతిరేక దిశలో మండించి వేగాన్ని తగ్గించుకుంటుంది. వేగం పూర్తిగా నెమ్మదించిన తర్వాత చంద్రుడి దక్షిణ ధృవంలో 70 డిగ్రీల వద్ద రోవర్ నేలను తాకుతుంది. ఆ తర్వాత ల్యాండర్ భూమి నుంచి వెళ్ళే సిగ్నల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకూ చంద్రుడిపైకి రోవర్ పంపింది కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలు మాత్రమే. చంద్రుడిపై పరిశోధన కోసం అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ నాసా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 2008లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనిపెట్టి చంద్రుడిపై పరిశోధనల్లో కీలకమైన విషయాన్ని భారత్ కనుగొన్నది. ఆ తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2.. విజయవంతంగా చంద్రుడిపై దిగినప్పటికీ క్రాష్ లాండింగ్ వల్ల భూమి నుంచి సంబంధాలు కోల్పోయి ప్రాజెక్టు విఫలం అయ్యింది. ఇప్పుడు చంద్రయాన్ 3 ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించడం ద్వారా చంద్రుడి వాతావరణాన్ని విశ్లేషించి అత్యంత కీలకమైన సమాచారాన్ని భూమికి అందజేస్తుంది. ఈ సమాచారం కోసం నాసా వంటి సంస్థలు ఎదురు చూస్తున్నాయి.