ఈసారి 40 స్థానాల్లో పోటీ
వైఎస్ జగన్ ఒక్క చాన్స్ దెబ్బకు ఏపీలో కేవలం 23 సీట్లకు పరిమితమైన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు బలహీనమైన ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. వచ్చే ఎన్నికలలోగా పుంజుకొని మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు.. ఈసారి తెలంగాణపై కూడా ఫోకస్ చేస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కనుమరుగైపోయింది. తెలంగాణలో నామమాత్రంగా మిగిలిపోయిన టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు లాంటి పదవులు కూడా నామమాత్రంగానే మారిపోయాయి. అయితే.. ఇటీవల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చేశారు చంద్రబాబు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కనీసం 40 సీట్లలో పోటీ చేసి.. అధికారంలోకి రాకపోయినా.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయటం దాదాపు ఖరారైనట్టే. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉంటుందో ఎలా పోటీలో నిలబడతారో అన్న విషయాల్లో స్పష్టత లేనప్పటికీ.. ఖచ్చితంగా తెలంగాణలో 40 స్థానాల్లో పోటీ చేసి తీరాలనేది మాత్రం చంద్రబాబు ధృడ నిశ్చయమని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. క్రితం సారి బీసీ పాట పాడి మోసపోయిన చంద్రబాబు.. ఈసారి తెలంగాణలో ఏ నినాదంతో పోటీ చేస్తాడో చూడాలి.