చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్లు
చాలా రోజుల తర్వాత తెలంగాణలో పర్యటించి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. “తెలంగాణలో టీడీపీ లేదు అనే వారికి ఇదే సమాధానం” అంటూ భారీగా హాజరైన కార్యకర్తలను చూపించాడు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలో లేక అభిమానులో.. లేక ఎన్టీఆర్ అభిమానులో.. అదీ కాక చంద్రబాబు అభిమానులో.. ఎవరైతే ఏంటి.. మొత్తానికి ఆయన సభకు భారీగా జనం హాజరయ్యారు. ఇది టీడీపీ శ్రేణులకు చాలా మంచి పరిణామం. కానీ.. ఈ మాత్రం దానికే తెలుగు దేశం పార్టీ తెలంగాణలో ఏదో సాధించబోదు అన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ.. ఒకప్పుడు తన పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతం కాబట్టి తాను తన అభిమానులకు కార్యకర్తలకు దూరం కాలేదు అని గట్టిగా చెప్పటమే చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా.. ఈ సభలో చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ క్లారిటీని తీసుకొచ్చాయి.
గత కొద్ది రోజులుగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విలీనం గురించి ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు మాట్లాడటం చూస్తున్నాం. రెండు రాష్ట్రాలు కలిస్తే తమకంటే ఎక్కువ సంతోషించే వారు లేరంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇంకొంత మంది ఇతర నేతలు కూడా తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిస్తే శుభ పరిణామమే అంటూ మాట్లాడారు. కానీ చంద్రబాబు మాత్రం అందరికంటే స్పష్టంగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల కలయికపై “బుద్ధి ఉన్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు” అంటూ తిట్టేశారు. ఆయనకు కూడా రెండు రాష్ట్రాలు కలవాలని మనసులో ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు కదా.. కాబట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణను ఏపీతో కలిపేస్తా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడతారు కదా.. అందుకే ఉమ్మడి రాష్ట్రం కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. యేళ్ళ కొద్దీ పోరాడి.. ప్రాణ త్యాగాలు చేసి సాధించిన తెలంగాణను మళ్ళీ ఏపీతో కలిపేస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా.. అసలు అది జరిగే పనేనా.. ఈ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ చంద్రబాబు అందుకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు అనటంలో సందేహం లేదు