ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కలిసి ఢిల్లీకి రావాలంటూ బీజేపీ అధిష్టానం ఆదేశించింది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కొద్ది రోజుల నుంచి వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా.. ఆయనతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సమానంగా పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు సరికదా.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే ప్రసక్తే లేదంటూ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ మళ్ళీ షరా మామూలుగానే ఉంది. కాకపోతే.. ఈటెల రాజేందర్ కు సరైన గౌరవం లభించటం లేదనీ.. ఈ విషయంలో ఈటెల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటెలను కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానించటం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. దీనిపై ఈటెల స్పందించటం.. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పటంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
ఇదంతా జరిగిన ఇన్ని రోజులకు మళ్ళీ ఈటెల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అమిత్ షా ఢిల్లీకి రావాలని ఆదేశించారు. ఈ సారి తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. క్రితం సారి ఈటెల ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే మునుగోడు పరాజయం తర్వాత కోమటిరెడ్డి కూడా పెద్దగా పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్టు కనిపించలేదు. పార్టీతో పాటు అసలు రాజకీయాలకే కోమటిరెడ్డి దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలా మౌనంగా ఉన్న వీళ్ళిద్దరినీ అమిత్ షా ఢిల్లీకి పిలవటం వెనుక కారణం వారికి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడమేనని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటితో పాటు జూపల్లిని బీజేపీలో చేర్చేందుకు ఈటెల గట్టిగానే ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరికి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహం మరియు అభ్యర్థుల ఎంపిక తదితర కీలక అంశాలపై చర్చించటంతో పాటు తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన పదవుల నియామకం గురించి మాట్లాడేందుకే ఈటెల, కోమటిరెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.