ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సొంత పార్టీపైనా.. అధినేత కేసీఆర్ పైనా విరుచుకుపడ్డాడు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరాడు. గత కొంత కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్న పొంగులేటి.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీకి, అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా వివాదాస్ఫద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. సోమవారం నాడు భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేటలో పొంగులేటి తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాడు. ఈ సమ్మేళనంలో మాట్లాడిన పొంగులేటి తన విమర్శల వాడి మరింత పెంచి.. ఏకంగా అధిష్టానాన్ని సవాల్ చేశాడు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదనీ, పార్టీని వీడటం.. మరో పార్టీలో చేరటం అనేది తన అనుచరులను అడిగి నిర్ణయించుకుంటానని చెప్పాడు.
అయితే.. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులకు జిల్లా పార్టీ షాకిచ్చింది. పొంగులేటి కార్యక్రమానికి హాజరైన వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పార్టీ కార్యాలయాల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తరచూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై వ్యతిరేకతతో మాట్లాడుతున్న పొంగులేటి వెంట నడిచినందుకే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పొంగులేటికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. ఇది ఇలా ఉంటే.. పొంగులేటి పార్టీని వీడతారా లేదా క్లారిటీ లేదు. పార్టీ వీడినా ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చేలా చేసుకోవాలని.. తద్వారా లబ్ధి పొందాలనేది పొంగులేటి ఆలోచన అని జిల్లా పార్టీ నేతల అభిప్రాయం. త్వరలో పార్టీ నుంచి పొంగులేటి సస్పెండ్ అవుతారనే మాట కూడా వినిపిస్తోంది.