భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భావ సభ ఖమ్మంలో అట్టహాసంగా జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు రెండో దశను ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక మాజీ ముఖ్యమంత్రితో సహా పలువురు జాతీయ పార్టీల నేతలు లాంఛనంగా ప్రారంభించారు. వారి చేతులతో వారే స్వయంగా వృద్ధులకు కళ్ళజోళ్ళు తొడిగి కంటివెలుగు సక్సెస్ కావాలంటూ ఆకాంక్షించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇలా ఐదుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించటం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ ప్రసంగించనున్న మొదటి బహిరంగ సభ కావటంతో చాలా మంది జాతీయ నేతల దృష్టి ప్రస్తుతం కేసీఆర్ పై కేంద్రీకృతం అయింది. ఈ సభలో ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వ్యూహం.. తెలంగాణ భవిష్యత్ ముఖ్యమంత్రి ఎవరు.. కేంద్రంలో ఏయే పార్టీలు కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారు.. ఇలాంటి అంశాలన్నింటిపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.
ఖమ్మం కొత్త కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముందుగా ఊహించినట్టే ఈ సభకు జనం భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నలుమూలల నుంచి కనీసం 5 లక్ష మంది ఈ సభకు హాజరవుతారని ముందే ఊహించి.. ఇందుకు తగినట్టుగానే భారీ ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే కేసీఆర్ ఈ సభలో ప్రసంగించనున్నారు.