తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితి పార్టీగా రూపాంతరం చెంది జాతీయ పార్టీగా ఆవతరించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మొదటి సారిగా బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించనుండటం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా చెప్తున్న ఈ పబ్లిక్ మీటింగ్ కు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేసీఆర్ తో పాటు వేదికపై కూర్చోనున్నారు. కాబట్టి ఈ సభకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ చౌహాన్ చెప్పారు. 5 వేల మంది పోలీసు సిబ్బందితో ఖమ్మం సభ వద్ద భారీ బందోబస్తు చేశామన్నారు. సభకు వెళ్ళటానికి సెల్ ఫోన్లు తప్ప మరేవీ అనుమతించమని చెప్పారు.
కేసీఆర్ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించటం వెనుక ఓ పెద్ద రాజకీయ కోణం.. వ్యూహం ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. ఖమ్మంలో గ్రూపు రాజకీయాలు.. తిరుగుబాటు దారుల విమర్శలు.. ప్రతిపక్షాలు పుంజుకోవటం.. ఇలాంటివన్నింటకీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఖమ్మంలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం ఈ సభ ద్వారానే ప్రారంభం కానుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ చాలా కీలకమైన నిర్ణయాలను ప్రకటించనున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.