ఇటీవల ఢిల్లీ కార్పోరేషన్ కు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి షాకిచ్చిన ఢిల్లీ ప్రజలు.. ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. గతంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ సారి భారీగా స్థానాలు కోల్పోయి డీలా పడింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు హాట్ టాపిక్ గా మారాయి. మోడీ చరిష్మా తగ్గిందనీ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలు తగ్గాయనీ రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ మేయర్ పదవి కోసం బీజేపీ కుట్ర చేస్తోందనీ.. కార్పోరేటర్లను కొనేసి ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందనీ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వివాదంతో గతంలో జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నిక రసాభాసగా మారి చివరికి వాయిదా పడింది. అయితే.. ఈ రోజు ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయింది.
ఎవరూ ఊహించని విధంగా బలమైన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించింది. ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఢిల్లీ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మధ్యాహ్నం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 15 ఓట్లు రాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 14 ఓట్లు వచ్చాయి దీంతో ఢిల్లీ మేయర్ గా అనూప్ గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కొనుగోలు రాజకీయాలు చేసి సభ్యులను మభ్యపెట్టడం ద్వారానే బీజేపీ ఢిల్లీ మేయర్ పదవి కైవసం చేసుకుందంటూ ఆప్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలు మాత్రం.. “మేం సభ్యులను కొన్నామని మీరు చెప్తున్నప్పుడు.. అక్కడ తప్పు చేసింది అమ్ముడుపోయిన మీ కార్పోరేటర్లదే తప్ప.. పదవి ఆశ చూపిన మాది ఎలా అవుతుంది..?” అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు.