బ్యాంకు పనిదినాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక నుంచి అన్ని బ్యాంకులు వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని చేసే దిశగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో బ్యాంకులకు వారానికి 5 రోజులు పని దినాలుగా ఉండాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. కానీ.. బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా కేంద్రం ఈ డిమాండ్ ను అంగీకరించలేదు. కావాలంటే ఉద్యోగులకు 19 శాతం వేతనం పెంచటానికి సిద్ధంగా ఉన్నామని.. పనిదినాల కుదింపు కుదరదని అప్పట్లో కేంద్రం బ్యాంకు ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. దీనిపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు కూడా పిలుపునివ్వగా.. కొన్ని కారణాల వల్ల సమ్మె వాయిదాపడింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి కేంద్రం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
వారానికి 5 పనిదినాలు పనిచేసినందుకు గానూ ప్రతి రోజూ ఉద్యోగుల పని సమయాన్ని 40 నిముషాల పాటు పెంచేందుకు కూడా కేంద్రం నిర్ణయించుకుంది. ఇక నుంచి బ్యాంకులు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేయనున్నాయి. ఈ నిబంధనకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.