పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే అరెస్ట్ చేసిన నిందితుడు ప్రశాంత్ తో బండి సంజయ్ వాట్సాప్ లో చాట్ చేయటంతో పాటు వందకు పైగా కాల్స్ మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు బండి సంజయ్ ను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. బండి సంజయ్ అరెస్టు అక్రమం అంటూ రోడ్లపైకి ఎక్కి ధర్నాలు, రాస్టారోకోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు పలువురు బీజేపీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
పేపర్ లీక్ కావటానికి ముందు నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్ తో వాట్సాప్ లో చాట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అలాగే సుమారు 120 సార్లు ఫోన్ లో మాట్లాడాడని అంటున్నారు. దీనిపై తమ వద్ద సాక్ష్యాలున్నాయనీ.. వాట్సాప్ చాట్ ను రికవర్ చేసి భద్రపరిచామనీ చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్ ను వరంగల్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ఘటనపై ఘాటుగానే స్పందిస్తున్నారు. బీజేపీ పార్టీ కుట్ర చేసి పేపర్ లీకేజీలు చేయిస్తోందనీ.. పదో తరగతి పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ కుట్ర ఉందనీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.