బండి సాయి భగీరథ్ వైరల్ వీడియో వివాదంపై అతని తండ్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అసలు విషయం తెలుసుకోకుండా తన కొడుకుపై క్రిమినల్ కేసులు బనాయించటంపై ఆయన సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అసలు కాలేజిలో ఏం జరిగిందో మీకు తెలుసా.. ఇలాంటి సందర్భంలో పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందజేసి.. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్న విషయం కనీసం తెలియదా మీకు.. పిల్లలను రాజకీయాలకు వాడుకుంటారా.. అంటూ ఘాటు ప్రశ్నలు వేశారు. నేను పిల్లలతో రాజకీయం చేయను.. మానవత్వం అడ్డొస్తుంది.. తల్లిని, పిల్లలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. నీ కూతుర్ని కొడుకును ఓసారి అడుగు నువ్వు చేసింది తప్పో ఒప్పో చెప్తారు.. అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బండి సాయి భగీరథ్ పై దుండిగల్ పోలీసులు నాలుగు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయటంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతుంటే ఎంత మందిని ఇప్పటి వరకు శిక్షించారో చెప్పాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఈ విషయమై అధికార పార్టీ నేతలు గానీ.. పోలీసు ఉన్నతాధికారులు గానీ స్పందించలేదు