అన్ స్టాపబుల్ షో సందర్భంగా నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నర్సులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా బాలయ్యపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎట్టకేలకు దీనిపై బాలకృష్ణ స్పందించారు. వివాదంపై సుదీర్ఘ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అందరికీ నమస్కారం. నేను నర్సులను కించపరుస్తూ మాట్లాడనని విమర్శిస్తున్నారు. నా మాటలను వక్రీకరించారు. నాకు నర్సులంటే అపారమైన గౌరవం. బసవతారకం హాస్పిటల్ లో నర్సుల సేవలను కళ్ళారా చూశాను. రోగుల ప్రాణాలు కాపాడటం కోసం వారు పడే శ్రమ ఎంతో గొప్పది. కరోనా సమయంలో కూడా రోగుల ప్రాణాలు కాపాడింది నర్సులే. నర్సులపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు నర్సులకు బాధ కలిగించి ఉంటే నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను..” అంటూ బాలకృష్ణ తన పోస్టులో వివరించారు.
ఇటీవలి కాలంలో బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్ఫదంగా మారుతున్నాయి. వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలకృష్ణ తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ నర్సుల గురించి చేసిన ఓ కామెంట్ మరో వివాదానికి దారి తీసింది. మొత్తానికి ఈ వివాదానికి బాలకృష్ణ పోస్టులో ఫుల్ స్టాప్ పడినట్టే.