దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి.. కశ్మీర్ ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక కీలక పదవులు చేపట్టిన సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్.. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం రాహుల్ గాంధీ ప్రవర్తన వల్లనే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తోందంటూ ఆరోజున కన్నీటి పర్యంతమైన ఆజాద్.. తాజాగా మరోసారి రాహుల్ పై సంచలన ఆరోపణలు చేశాడు. రాహుల్ గాంధీ తరచూ విదేశాలకు ఎందుకు వెళ్తాడో తెలుసా.. అక్కడ ఎవరెవరిని కలుస్తాడో తెలుసా అంటూ రహస్యాలు బయటపెట్టాడు. రాహుల్ విదేశాల్లో చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళను కలిసి వ్యాపార లావాదేవీలు చేస్తాడంటూ ఆజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తాడన్న విషయం తెలిసిందే. యేడాదికోసారి ఆయన రాజకీయాలకు దూరంగా విదేశాలకు వెళ్ళి సేదతీరతాడంటూ కాంగ్రెస్ నేతలు చెప్తుంటారు. కానీ.. ఆజాద్ మాత్రం రాహుల్ అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళను కలిసేందుకే విదేశీ పర్యటనలు చేస్తాడంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దశాబ్ధాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను దగ్గరగా చూసిన అనుభవం గులాం నబీ ఆజాద్ కు ఉంది. కాబట్టి.. ఆజాద్ ఆరోపణలకు బలం చేకూరింది. ఆజాద్ వ్యాఖ్యలను బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. గతంలో హిండెన్ బర్గ్ అదానీ వివాదంలో మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ విదేశాలకు వెళ్ళి ఏం చేస్తాడు.. ఎవరిని కలుస్తాడనే వివరాలు బయటపెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆజాద్ వ్యాఖ్యలపై ఇంకా కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించలేదు.