బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షి ఉమేశ్ పాల్ ను హత్య చేసిన నేరానికి గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడిని పోలీసులు ప్రయాగ్ రాజ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే రాజుపాల్ ను 2005లో దుండగులు హత్య చేశారు. ఈ ఘటనలో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చిన అనంతరం ఉమేష్ పాల్ ను గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ మరియు అతని అనుచరులు కిడ్నాప్ చేసి వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవాలని బెదిరించారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇదే ఉమేష్ పాల్ ను మరియు అతడి ఇద్దరి అనుచరులను అతీక్ అహ్మద్ తన అనుచరులతో కలిసి హత్య చేశాడు. ఇది ఉత్తర్ ప్రదేష్ లో సంచలనంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లో హత్య రాజకీయాలు జరుగుతున్నాయనీ.. ఉమేష్ పాల్ హత్యకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సర్కారే కారణమంటూ యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. దీనికి సమాధానంగా సీఎం యోగీ తీవ్రంగా స్పందించాడు. ఎక్కడో ఎవరో హత్య చేస్తే దానికి ప్రభుత్వం ఎలా కారణమవుతుందని ప్రశ్నించిన యోగీ.. మొత్తం గ్యాంగ్ స్టర్లను మట్టిలో కలిపేస్తానంటూ అసెంబ్లీలోనే ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు రౌడీలను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు ఆ హత్యకు సూత్రధారి అతీక్ అహ్మద్ కు జైలు శిక్ష పడింది.