HomeINTERNATIONAL NEWSచైనాకు షాకిచ్చిన యాపిల్ : ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ

చైనాకు షాకిచ్చిన యాపిల్ : ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ

Published on

Latest articles

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...

ప్రపంచ తయారీ హబ్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు చైనా. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, భవిష్యత్‌ మాత్రం ఆ దేశానిది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే తయారీ రంగంలో డ్రాగన్‌కు ఇప్పుడు పోటీ పెరుగుతోంది. అదికూడా ఇండియా నుంచి. భారత్ ఎప్పట్నుంచో చైనా స్థానాన్ని భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇండియాకు ఆ దిశగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనాకు అవకాశాలు క్రమంగా దూరమవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్‌ భారత్ ఎంట్రీనే. అదికూడా చైనా మ్యానుఫాక్చరింగ్‌ను తలదన్నే స్థాయిలో ఇండియాలో యాపిల్ కార్యాచరణ ఉండబోతోంది. యాపిల్‌తో పాటూ మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్స్‌ డ్రాగన్‌కు గుడ్‌బై చెప్పడానికీ, భారత్‌లో ఎంట్రీ ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాయి.
తయారీ రంగంలో భారత్‌కు ఉన్న అవకాశాలపై ఇటీవలే గోద్రెజ్ అండ్ బోయ్స్ ఛైర్మన్ జంషీద్ నౌరోజీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నరేళ్లలో కరోనా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు వ్యాపారాలను దెబ్బతీశాయని తెలిపారు. దానివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అద్భుతమైన అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలా కంపెనీలు చైనా నుంచి తయారీని ఇతర ప్రాంతాలకు మార్చే పనిలో ఉన్నాయని.. మరిన్ని కంపెనీలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయన్నారు. కాబట్టి తయారీకి అనువైన హబ్‌గా భారత్ ఎక్కువమందికి ఆకర్షణంగా మారిందని వివరించారు. తయారీ రంగంలో ఉండే సవాళ్లను అధిగమించేందుకు, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. తయారీకి అత్యంత సామర్థ్యం కలిగి ఉండాలని.. దానికి తోడు వ్యాపారం ఇబ్బందుల్లేకుండా కొనసాగేందుకు సరఫరాదారులు, తయారీదారుల మధ్య పరస్పర భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా సరఫరాలో సమస్యలు తలెత్తకూడదని నౌరోజీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలోనూ అందుకవసరమైన అవగాహన ఉండాలని అన్నారు.
నౌరోజీ చెప్పారని మాత్రమే కాదు.. తయారీ రంగంలో ఇండియాకు చైనాను చేరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయనేది అంతర్జాతీయ నిపుణుల మాట. ఎందుకంటే అగ్రరాజ్యం హోదాలో ఉన్న అమెరికా ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అమెరికన్ డాలర్ వినియోగాన్ని ఇతర దేశాలు తగ్గిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు కూడా తమ సొంత కరెన్సీలోనే జరుపుతున్నాయి. తొలుత రష్యా మొదలు పెట్టగా అదే బాటలో చైనా, బ్రెజిల్ అడుగులేశాయి. ఇప్పుడు భారత్ కూడా మున్ముందు ఆ దేశాలలాగే ఎగుమతులు, దిగుమతులు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే జరిగితే భారత్ కరెన్సీ విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అత్యధిక విదేశీ కంపెనీలు ఉన్న చైనాలో కూడా అనుకూల పరిస్థితులు లేక భారత్ బాట పడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ తయారీ రంగంలో ఉన్నత హోదాను పొందడానికి ఎక్కువ సమయం పట్టదనేది నమ్మలేని నిజం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇండియాకు స్మార్ట్‌ ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
భారత్‌లో యాపిల్‌ మొట్టమొదటి రిటైల్‌ స్టోర్‌ ప్రారంభానికి టైం ఫిక్స్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ తొలి స్టోర్‌ను ముంబైలోని బంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌ను ఈ నెల 18న ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. అలాగే, ఈ నెల 20న ఢిల్లీలోనూ మరో స్టోర్‌ ప్రారంభించనున్నట్టు యాపిల్ ప్రకటించింది. ఈ రెండు స్టోర్స్ ప్రారంభోత్సవానికి యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యే అవకాశం ఉంది. రిటైల్‌ స్టోర్ల ఓపెనింగ్‌ కోసం టిమ్‌ కుక్‌ వస్తున్నారన్న వార్తలను బట్టి.. ఐఫోన్లు సహా ఆపిల్‌ ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి, మార్కెటింగ్‌ విషయంలో భారత మార్కెట్‌కు ఆ గ్లోబల్‌ కంపెనీ ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, టిమ్‌ కుక్‌ పర్యటనను యాపిల్‌ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. మరోవైపు.. 2016లో ఆపిల్‌ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత ఇండియాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనే కనుక నిజమైతే భారత్‌లో యాపిల్ కార్యాచరణ అంతకుమించి ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
వాస్తవానికి భారత ఐఫోన్‌ల విక్రయాలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతులు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బీజింగ్‌, వాషింగ్‌టన్‌ మధ్య వాణిజ్య సంబంధాలు చెడిపోవడం, జిన్‌పింగ్ సర్కార్ నియంతృత్వ నిర్ణయాలతో చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు యాపిల్‌ కంపెనీ భారత్‌ వైపు చూస్తోంది. వాస్తవానికి, ఈ రెండు స్టోర్లను చాలా కాలం క్రితమే ఓపెన్‌ చేయాల్సి ఉంది. దేశీయ అమ్మకాల్లో ఎక్కువ మొత్తాన్ని దేశీయంగా తయారు చేయని గ్లోబల్ కంపెనీలు తమ సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌లను మన దేశంలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నియమాలు విధించింది. దీంతో ఈ రెండు స్టోర్లు చాలా కాలంగా పెండింగ్‌ ఉన్నాయి. దేశీయంగా ఇప్పటి వరకు ఫిజికల్‌ స్టోర్‌ను ప్రారంభించలేకపోయినా, ఇండియన్‌ ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లోనే ఆపిల్‌ ప్రారంభించింది. మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉంది. ఫలితంగా యాపిల్ ఇండియావైపు చూస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరోవైపు.. ముంబై, ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవాల మధ్య ఉన్న గ్యాప్‌లో, ప్రధాని మోడీతో టిమ్‌ కుక్‌ సమావేశం కానున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందుకోసం ప్రధాని మోడీని సమయం కేటాయించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. నిజానికి.. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఈ విభాగంలోకి వచ్చే కంపెనీలను అధికంగా ప్రోత్సహిస్తోంది. యాపిల్‌ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌ కోసం బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించింది. ఈ క్రమంలోనే యాపిల్ ఎర్నింగ్స్ కాల్స్‌లోనూ భారత మార్కెట్, ఉత్పత్తి కేంద్రంగా భారతదేశ ప్రాముఖ్యత గురించి టిమ్‌కుక్ ప్రస్తావించారు. త్రైమాసిక ఆదాయ రికార్డును భారత్‌ నెలకొల్పింది, గతేడాది కంటే బలమైన రెండంకెల వృద్ధిని సాధించిందని అన్నారు. భారతదేశం తమకు అత్యంత ఉత్తేజకరమైన మార్కెట్ అనీ, తమ ప్రధాన దృష్టి ఇండియాపైనే అని కుక్‌ ఇటీవలే చెప్పారు.
ముంబై, ఢిల్లీ స్టోర్‌లు మాత్రమే కాదు.. యాపిల్ ఉత్పత్తుల్లో మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా భారత్ అవతరించడానికీ రంగం సిద్ధమవుతోంది.దేశీయ మార్కెట్లో నమ్మికైనా టాటా గ్రూప్ బెంగళూరులోని విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్‌ను ఈ నెల చివరి నాటికి కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఇదే జరిగితే యాపిల్ ఉత్పత్తుల కోసం భారతదేశం మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా అవతరిస్తుందనటంలో సందేహం లేదు. టాటా గ్రూప్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత ఐఫోన్15ను తయారు చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లోని ఎనిమిది ఉత్పత్తి లైన్లలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 14 తయారవుతున్నాయి. టాటా బెంగళూరు ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, యాపిల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఏకైక ప్లాంట్ విస్ట్రాన్ పూర్తిగా దేశీయ మార్కెట్‌కు దూరంగా ఉంటుంది. ఇవన్నీ టాటా గ్రూప్ సొంతమవుతాయి. యాపిల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ టేకోవర్ ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా యాపిల్ చైనా నుండి షిఫ్ట్‌ను ప్లాన్ చేస్తున్న కారణంగానే ఇండియాలోని ప్లాంట్ టాటా గ్రూప్ స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది.
గతేడాది కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో కంపెనీ చైనా, అమెరికా మధ్య విభేదాలు ఏర్పడిన కారణంగా తమ ఉత్పత్తిలో 25శాతం భారతదేశానికి మార్చాలని దాని కోసం తన ప్రణాళికలను కూడా ప్రకటించింది. మన దేశంలో యాపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే మూడు తైవాన్ కంపెనీలలో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్‌కాన్ వున్నాయి. ఇప్పుడు విస్ట్రాన్‌లో కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయగా.. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్లలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భారత్‌లో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. దీనికోసం కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ కోసం పెగాట్రాన్ తయారీ యూనిట్లను టాటా కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి.. యాపిల్ ఉత్పత్తుల్లో చైనా బయట తయారీ జరుగుతోంది కేవలం 5శాతం మాత్రమే. మిగిలిన 95శాతం ఉత్పత్తి చైనా కేంద్రంగానే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో తమ కార్యకలాపాలతో ఆ పరిస్థితులు మార్చాలని యాపిల్ భావిస్తోంది. యాపిల్ సీఈవో తాజా పర్యటనలో మోడీతో భేటీ అంటూ జరిగితే ఆ దిశగానే చర్చలు జరిగే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అదే నిజం అయితే ప్రధాని మోడీ సైతం పాజిటివ్‌గానే రియాక్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ సర్కార్‌ మేక్ ఇన్ ఇండియా 2.ఓ లో భాగంగా 27 రంగాలపై దృష్టి సారిస్తోంది. వాటిలో 15 తయారీ, 12 సేవా రంగాలు ఉన్నాయి. ఫర్నీచర్, అగ్రి ప్రోడక్ట్స్‌, టెక్స్‌టైల్, రోబోటిక్స్, టెలివిజన్, అల్యూమినియం రంగాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం భారత తయారీ రంగం దేశ జీడీపీలో 15-16శాతం వాటా కలిగి ఉంది. రానున్న సంవత్సరాల్లో దీన్ని 25శాతానికిపైగా తీసుకెళ్లాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మోడీ సర్కార్ తాజా లక్ష్యాలకు యాపిల్ ఎంట్రీ ఓ కీలక ముందడుగుగా చెబుతున్నారు.

FOLLOW US

More like this

“మోడీ”పై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాహుల్ గాంధీ

మోడీ ఇంటిపేరు వివాదంలో ఇరుక్్కొని పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష...

మందుబాబులకు బ్యాడ్ న్యూస్ : 2 రోజులు వైన్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు...

ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలంగాణ చీర బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనల్లో సాధారణంగా బహుమతులు ఇచ్చి...