హిండెన్ బర్గ్ రిపోర్టుతో 132 బిలియన్ డాలర్ల ఆస్తిని కోల్పోయినప్పటికీ అదానీ గ్రూప్ హవా కొనసాగుతోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు దక్కించుకోవటంలో ఎప్పుడూ ముందుండే అదానీ గ్రూప్ కు మహారాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు కట్టబెట్టింది. దేశంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాగా పిలవబడే ముంబైలోని ధారావిని అభివృద్ధి చేసే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను అదానీ ప్రూప్ దక్కించుకుంది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పతనమైన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అదానీ గ్రూప్ కు కొత్త ప్రాజెక్టు కోసం లోన్ ఇవ్వటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ కు లోన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ సంజీవ్ చద్దా వ్యాఖ్యానించారు.
అదానీ గ్రూప్ సరైన గ్యారంటీ ఇస్తే లోన్ ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సంజీవ్ ప్రకటించారు. బ్యాంకింగ్ నిబంధనలకు లోబడి అదానీ గ్రూప్ కు లోన్ ఇవ్వటానికి తాము సిద్ధమని చెప్పిన ఆయన.. కష్ట సమయంలో అండగా నిలబడటం మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లను భారీగా విక్రయించేశారు. షేర్ వాల్యూ పడిపోయిన తరుణంలో అదానీ గ్రూప్ కు లోన్లు ఇచ్చిన కంపెనీలు అదానీ గ్రూప్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం కాగా.. ఇంకొన్ని బ్యాంకులు తమ లోన్లు రికవరీ చేయటానికి సిద్ధమయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.