ఖలిస్తాన్ వేర్పాటుపాద నాయకుడిగా తనను తాను ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్ పాల్ మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర మొత్తం హై అలర్ట్ ప్రకటించి అతడి కోసం ఏటీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో అమృత్ పాల్ సింగ్ గురించి చేసిన విచారణలో అతడు పాల్పడిన నేరాల చిట్టా బయటపడింది. ఖలిస్తాన్ వేర్పాటువాదం పేరుతో వారిస్ పంజాబ్ దే సంస్థకు తనకు తాను నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ కు పాకిస్తాన్ నుంచి ఖచ్చితమైన ఆదేశాలతో పాటు భారీ ఆర్థిక సహాయం అందుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ సింగ్ కు డబ్బులు, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
అమృత్ పాల్ సింగ్ ఖలిస్తాన్ సానుభూతిపరుల నుంచి వసూలు చేసిన చందా డబ్బులతో లెక్కకు మించిన కార్లు కొనుగోలు చేసి కాన్వాయ్ లో తిరుగుతూ శాంతి భద్రతలను నాశనం చేసేందుకు పథకాలు వేస్తున్నట్టు ఇంటలిజెన్స్ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఓ ట్రక్ డ్రైవర్ గా బతుకు వెల్లదీసే ఇతడిని పాకిస్తాన్ ఐఎస్ఐ కావాలనే భారత్ కు రప్పించి పంజాబ్ లో అశాంతిని రగిల్చేందుకు తయారు చేసిందని చెప్పారు. అతడి ఇల్లు, అనుచరులను విచారించటంతో పాటు ఫోన్లను, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించిన పోలీసులకు అతడి అక్రమ సంబంధాలు, ఇతర నేరాలకు సంబంధించి వివరాలు లభ్యమయ్యాయి. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు నడుపుతున్నట్టు తెలిసింది. మతాల మధ్య చిచ్చు పెట్టి.. దేశంలో మతకల్లోలాలు సృష్టించటమే లక్ష్యంగా అతడితో పాకిస్తాన్ ఐఎస్ఐ పనిచేయిస్తోంది. భారీగా సొమ్మును కూడా అందజేసినట్టు తెలుస్తోంది. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం.. రాత్రి పూట తిరుగుతూ మతాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం.. ఖలిస్తాన్ వైపు యువతను రెచ్చగొట్టడం ఇవి అమృత్ పాల్ సింగ్ ప్రధాన లక్ష్యాలని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అతడు ఇంకా పోలీసులకు చిక్కలేదు సరికదా.. ఇతరుల సాయంతో నేపాల్ గుండా కెనడా లేదా అమెరికా పారిపోయి ఉండవచ్చని సమాచారం.
