రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ గత కొద్ది రోజులుగా పలువురు రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ అరెస్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇచ్చిన రెజ్లర్లు ప్రస్తుతం శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెజ్లర్లతో రహస్యంగా సమావేశం కావటం సంచలనంగా మారింది. మీడియా కంట పడకుండా.. బయటకు రాకుండా రెజ్లర్లతో అమిత్ షా భేటీ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావటం.. మోడీ, అమిత్ షాల మద్దతు అతనికి ఉందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్ళతో అమిత్ షా ఏం మాట్లాడాడు అనేది మాత్రం వెల్లడి కాలేదు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సమయంలో రెజ్లర్లు పార్లమెంట్ దిశగా ర్యాలీ చేస్తున్న సమయంలో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రెజ్లర్లు తమ ఒలంపిక్ మెడల్స్ ను గంగలో కలిపేస్తామని హెచ్చరించటం.. రైతు సంఘాల నాయకుడు టికాయత్ వాళ్ళను అడ్డుకొని ప్రభుత్వానికి 5 రోజుల గడువు ఇవ్వటం.. జరిగిపోయాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాధానం లేని సమయంలో అమిత్ షా రెజ్లర్లతో సమావేశం అయ్యారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేననీ.. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించి న్యాయపరంగా పోరాటం చేయమనీ అమిత్ షా రెజ్లర్లకు సూచించాడని సమాచారం. ఇకపై రోడ్లపై ధర్నాలు, ర్యాలీలు చేయటం మానుకోవాలనీ.. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య దృష్టిలో భారత్ పరువు పోవటం ఎవరికీ మంచిది కాదనీ రెజ్లర్లకు అమిత్ షా కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అమిత్ షా సూచనల మేరకు త్వరలోనే రెజ్లర్లు ఆందోళన ఆపేస్తారని సమాచారం.