పెను విధ్వంసం సృష్టించగల క్లస్టర్ బాంబుల విషయంలో అమెరికా అతి క్రూరమైన నిర్ణయం తీసుకుంది. దీనిపై అమెరికా మిత్రదేశాలే భగ్గుమంటున్నాయి. 5 వందల రోజులుగా సాగుతున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అటు ఉక్రెయిన్ ఇటు రష్యాలో కూడా ఆయుధ నిల్వలు అడుగంటిపోయాయి. ఉక్రెయిన్ కు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా చాలా యూరప్ దేశాలు ఆయుధ సాయం చేస్తుండగా.. వాటిని ఎదుర్కునేందుకు రష్యా తన ఆయుధాగారం మొత్తాన్ని వాడాల్సి వచ్చింది. రష్యా ఇప్పుడు మిత్రదేశాల నుంచి ఆయుధ సాయం కోరుతుండగా.. ఈ క్రమంలో అమెరికా దారుణమైన నిర్ణయం తీసుకుంది. తమ వద్ద పేరుకుపోయిన సుమారు 30 లక్షల క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు ఇవ్వటానికి బైడెన్ యంత్రాంగం సిద్ధమైంది. ఈ నిర్ణయంపై ఐక్యరాజ్య సమితి సహా మిగతా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా మిత్రదేశాలైన నాటో దేశాలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో మిత్రదేశాలను బుజ్జగించేందుకు బైడెన్ బ్రిటన్ వెళ్ళాడు. సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిగతా పేలుడు పదార్థాలు లేదా బాంబులు, మిసైల్స్ తో పోల్చితే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసం సృష్టించగలవు. చిన్న చిన్న బాంబులను ఒకే బాంబుగా కట్టగట్టినట్టుగా తయారు చేయటమే క్లస్టర్ బాంబు. ఇది ఎక్కడైతే ప్రయోగిస్తామో అక్కడ పేలి అందులోని చిన్న చిన్న బాంబులు చుట్టుపక్కల వందల మీటర్ల కొద్ది విసిరివేయబడతాయి. అలా విసిరివేయబడిన బాంబులు పడిన చోట పేలిపోయి నాశనం చుట్టుపక్కల ప్రాంతాలను నాశనం చేస్తాయి. ఇలా ఒక్క క్లస్టర్ బాంబు ప్రయోగించటం వల్ల పదుల సంఖ్యలో చిన్న బాంబులు ఎక్కువ విస్తీర్ణంలో విరిసివేయబడి ఎక్కువ ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. ఈరకమైన బాంబులను తయారు చేయటంపై 2008లోనే ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. 120 దేశాలు ఈ నిషేధాన్ని అంగీకరిస్తూ క్లస్టర్ బాంబులు తయారు చేయబోమనీ.. అలాగే ప్రయోగించబోమని ఒప్పందం మీద సంతకాలు చేశాయి. కానీ అమెరికా మాత్రం ఈ ఒప్పందంపై సంతకం చేయకుండా లక్షలాది క్లస్టర్ బాంబులను తయారు చేసింది. విదేశాలకు అమ్మేందుకు లక్షల్లో వీటిని తయారు చేసింది అమెరికా.
కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకూ క్లస్టర్ బాంబుల నిషేధ ఒప్పందంపై సంతకం చేయటంతో కొనేవారు లేక అమెరికా ఈ బాంబులను తయారు చేయటం ఆపేసింది. అప్పటికే తయారు చేసిన 30 లక్షలకు పైగా బాంబులు ఇప్పుడు అమెరికా ఆయుధాగారంలో పేరుకుపోయి అతిపెద్ద భారంగా పరిణమించాయి. ఉక్రెయిన్ కు మొదటి నుంచీ ఆయుధ సాయం చేస్తూ వస్తుండటంతో అమెరికా ఆయుధాగారం కూడా చాలా వరకూ ఖాళీ అయ్యింది. ఉక్రెయిన్ మరోసారి ఆయుధ సాయం అడగటంతో తమ వద్ద ఉన్న క్లస్టర్ బాంబులను వదిలించుకునేందుకు అమెరికాకు మంచి అవకాశం దొరికినట్టైంది. చాటుగా ఈ క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు పంపేందుకు అమెరికా నిర్ణయం తీసుకోగా.. మిత్రదేశాలే దీన్ని వ్యతిరేకించాయి. దీంతో బైడెన్ తమ మిత్రులను బుజ్జగించేందుకు పర్యటనలు చేస్తున్నాడు. అమెరికా క్లస్టర్ బాంబులను కనుక ఉక్రెయిన్ స్వీకరించి రష్యాపై ప్రయోగిస్తే.. పుతిన్ అందుకు కౌంటర్ గా జార్ బాంబులను ప్రయోగించేందుకు వెనుకాడడు. ఇదే జరిగితే ఒకే ఒక్క గంటలో ఉక్రెయిన్ బూడిదగా మారుతుంది.