భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ముందే ఊహించినట్టుగానే మోడీ పర్యటనలో భారత్-అమెరికా చరిత్రలోనే ఇప్పటి వరకూ సాధ్యం కాని ఎన్నో ఒప్పందాలు కార్యరూపం దాల్చుతున్నాయి. భారత్-అమెరికా దౌత్య అధికారులు కలిసి కొన్ని వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయగా.. మోడీ-బైడెన్ సమావేశంలో చారిత్రక ఒప్పందాలు కార్యరూపం దాల్చనున్నాయి. జెట్ ఇంజన్ల తయారీ ఒప్పందం అన్నింటికంటే కీలకం కానుంది. ఈ ఒప్పందం పూర్తి అయితే భారత్ స్థాయి వంద మెట్లు పైకెక్కినట్టే. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ నాలుగు దేశాల వద్ద మాత్రమే ఉన్న జెట్ ఇంజన్ తయారీ టెక్నాలజీ భారత్ కు లభిస్తుంది. ఇదే జరిగితే ప్రపంచంలో అత్యంత వైమానిక దళం కలిగిన ఐదో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇప్పటి వరకూ జెట్ ఇంజన్ తయారీ టెక్నాలజీని భారత్ కు అందించేందుకు ఏ దేశం కూడా అంగీకరించలేదు. కావాలంటే జెట్ ఇంజన్లు తయారు చేసి ఇస్తామే తప్ప టెక్నాలజీని బదలాయించటానికి కుదరదని పై నాలుగు దేశాలు తేల్చి చెప్పాయి. కానీ ఇప్పుడు అమెరికా మాత్రం జెట్ ఇంజన్ల తయారీ టెక్నాలజీని భారత్ ఇవ్వటమే కాకుండా భారత్ లోనే జెట్ ఇంజన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
జీఈ-ఎఫ్-414 జెట్ ఇంజన్లు ఇకపై భారత్ లో తయారు కానున్నాయి. అయితే.. చాలా యేళ్ళ క్రితం నుంచే భారత్ లో జెట్ ఇంజన్ల తయారీకి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసినప్పటికీ భారత్ ఈ మైలురాయిని చేరుకోలేకపోయింది. 1986 నుంటి భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి పేరిట జెట్ ఇంజన్ల తయారీ కోసం ప్రయత్నిస్తున్నా అది నెరవేరలేదు. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య ఒప్పందంతో భారత్ లో ఎఫ్414 యుద్ధ విమానాల జెట్ ఇంజన్లు తయారీ జరగనుంది. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్టు స్వీకరించనుంది. ఇదే జరిగితే భారత్ లో వేలాది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.
యుద్ధం అంటూ జరిగితే అందులో యుద్ధ విమానాలదే కీలకమైన పాత్ర. యుద్ధ ట్యాంకర్లు లేదా ఆర్మీ చేయలేని పనిని యుద్ధ విమానాలు చేస్తాయి. గాలిలో ఎగురుతూ శతృవుపై భీకర దాడి చేసి సర్వనాశక విధ్వంసం సృష్టించగలవు యుద్ధ విమానాలు. క్షణాల్లో శతృదేశ ఆర్మీ శిబిరాలను, ఆయుధాగారాలను బూడిద చేయవచ్చు. గాలిలో నుంచి మిసైల్ లాంచ్ చేయగల యుద్ధ విమానాలు.. వేల కిలో మీటర్లను నిముషాల్లో ప్రయాణించి శతృవును నిర్వీర్యం చేయగలవు. అత్యాధునిక యుద్ధ విమానాలు ఎవరి దగ్గర ఉంటే యుద్ధంలో విజయం వారిదే. అందుకే భారత్ రఫేల్ యుద్ధ విమానాల కోసం అంతగా ఖర్చు చేసింది. ఫైటర్ జెట్ విమానాల తయారీ కనుక భారత్ లో జరిగితే.. అంతర్జాతీయ యుద్ధ విమానాల వ్యాపారంలో భారత్ రారాజుగా వెలుగొందనుంది. యుద్ధ విమానాల ఇంజన్లు తయారీ టెక్నాలజీ ఏ దేశం వద్ద ఉంటుందో ఆ దేశాన్ని యుద్ధంలో ఓడించటం దాదాపు అసాధ్యం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఏ దేశం కూడా భారత్ తో ఈ టెక్నాలజీని పంచుకోటానికి అంగీకరించలేదు. ఈ ఒప్పందం ఇంత కీలకం కనుకనే.. మోడీ అమెరికా పర్యటనను ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తితో గమనిస్తున్నాయి. భారత్ ను అమెరికా వాడుకుంటున్నది అంటూ చైనా వ్యాఖ్యానించటం వెనుక ఉన్నది.. ఈ కడుపు మంట మాత్రమే. ఇప్పుడు చైనా భారత్ పై ఆక్రమణ ప్రయత్నం చేసే ధైర్యం చేయలేదు. ఇంకా మోడీ పర్యటనలో చాలా కీలక ఒప్పందాలు జరగనున్నాయి.. అయితే.. అవి ఏమిటనేది ప్రస్తుతానికి పూర్తి సమాచారం లేదు.