విడుదలైన మొదటి రోజు నుంచే వివాదాల పాలవుతూ వస్తున్నది ఆదిపురుష్ సినిమా. అలనాటి రామాయణ ఇతిహాసం మరియు శ్రీరాముడి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసమే మేం ఈ సినిమా చేస్తున్నామంటూ మొదటి నుంచీ చెప్పుకొచ్చిన డైరెక్టర్ ఓం రౌత్.. చివరికి రామాయణాన్ని తన ఇష్టారీతిన మార్చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. దీనిపై మొదటి నుంచీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ సినిమా టీమ్ పై ఘాటుగా వ్యాఖ్యానించింది. “ఆదిపురుష్ సినిమాతో మీరు ఏం చెప్పాలనుకున్నారు.. మీరు ఆ మతానికి చెందిన వారి ఓపికకు పరీక్ష పెట్టారా.. ఇతరుల నమ్మకాన్ని మార్చటానికి మీరెవరు ?” అంటూ ప్రశ్నించింది అలహాబాద్ హైకోర్టు. “రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అనే వారి పాత్రలను ఎంత అభ్యంతరకరమైన రీతిలో చూపించారు మీరు.. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి ?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. సామాజిక కార్యకర్తలైన కుల్దీప్ తివారీ, బందనా కుమార్ కలిసి రంజనా అగ్నిహోత్రి, సుధా శర్మ అనే లాయర్ల ద్వారా ఆదిపురుష్ సినిమాపై పబ్లిక్ ఇంట్రస్ట్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాశ్ సింగ్ విచారించారు. ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు.
ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ పై కూడా న్యాయమూర్తులు ఘాటుగానే స్పందించారు. “రాముడు, లక్ష్మణుడు, సీత వంటి పాత్రల నోటి నుంచి ఇలాంటి మాటలు పలికించటం వెనుక మీ అభిప్రాయం ఏమిటి ?” అని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు.. తాము తీసింది రామాయణం కాదు.. రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి ఓ సినిమా తీశామని మనోజ్ ముంతాషిర్ వ్యాఖ్యానించటాన్ని కూడా అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సినిమాలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, లంక పట్టణం.. ఇవన్నీ చూపించి ఇది రామాయణం కాదని చెప్పటమేమిటని ఘాటుగా ప్రశ్నించింది ధర్మాసనం. ఆదిపురుష్ డైలాగ్స్ పై విమర్శలు రావటంతో తాము తెరకెక్కించింది రామాయణం కాదంటూ మనోజ్ ముంతాషిర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. “ఇలాంటి రీతిలో సినిమా తెరకెక్కినప్పుడు సెన్సార్ బోర్డు దీనిపై ఏదైనా చేసి ఉండాల్సింది.. ఇలా వదిలేస్తే ఎలా ?” అంటూ సెన్సార్ బోర్డుకు కూడా అక్షింతలు వేసింది ధర్మాసనం. పిటిషన్ దారులకు వివరణ ఇవ్వాలంటూ సినిమా యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక సినిమా యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.